Mar 31,2023 08:11
  • వ్యవసాయ చట్టాల కాలంలో 375 కోట్లు లాస్‌
  • అడగని రాష్ట్ర సర్కార్‌
  • రైతుల సౌకర్యాలకు దెబ్బ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కరోనా అని సైతం చూడకుండా కేంద్రం 2020లో ఆగమేఘాలపై తీసుకొచ్చిన నూతన వ్యవసాయ నల్ల చట్టాల వలన మన రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు (ఎఎంసి) అక్షరాల 375 కోట్ల 25 లక్షల రూపాయల ఆదాయం కోల్పోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఎఎంసిల నుంచి రూ.617.74 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించగా రూ.242.49 కోట్లే లభించాయి. అంతకుముందు ఏడాది 2019-20 కంటే రూ.307.85 కోట్లు తగ్గాయి. అప్పుడు రూ.550.34 కోట్ల ఆదాయం వచ్చింది. 2020-21లో అంత తక్కువ ఆదాయం రావడానికి కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలే కారణమని ప్రభుత్వం నిర్ధారించింది. నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరానికిపైగా రైతుల నిరవధిక బైఠాయింపుతో కేంద్రం దిగొచ్చి చట్టాలను వెనక్కి తీసుకుంది. అయితే చట్టాలు అమల్లో ఉన్న కాలంలో రాష్ట్రంలోని ఎఎంసిలు రూ.వందల కోట్ల ఆదాయం కోల్పోవడంతో వాటి అభివృద్ధి కుంటుపడింది. దాంతో రైతులకు ఎఎంసిలు కల్పించే సౌకర్యాలు తగ్గాయి. మన ఎఎంసిలకు దక్కాల్సిన ఆదాయం కేంద్రం ఎగేసుకుపోయింది. ఆ లోటును పూడ్చమని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కనీసం మాటమాత్రమైనా కోరలేదు.
 

                                                                    చొరబాటు నిజమైంది

ఆంధ్రప్రదేశ్‌ (వ్యవసాయ ఉత్పత్తులు, పశుగణాలు) మార్కెట్ల సమగ్ర చట్టం 1966లో రాగా, రూల్స్‌1969లో వచ్చాయి. ఆ చట్టం ఎఎంసిల కార్యకలాపాలను నిర్దేశించింది. ఎఎంసిలు తమ పరిధిలోని వ్యవసాయ, పశుగణ మార్కెట్లను నియంత్రిస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 218 మార్కెట్‌ కమిటీలు, వాటి పరిధిలో మరో 324 ప్రకటిత మార్కెట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నోటిఫై చేసిన వ్యవసాయ, పశుగణాల ఉత్పత్తుల కొనుగోలుదారుల నుంచి, అనుమతి పొందిన లైసెన్స్‌దారుల నుంచి ఒక శాతం మార్కెట్‌ రుసుం వసూలు చేస్తున్నాయి. ఆ విధంగా సమకూరిన నిధులను మార్కెట్‌ కమిటీల పరిధిలో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాయి. కాగా కరోనా తొలిదశ వేళ ఇదే అదనుగా మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించి అత్యయిక ఉత్తర్వులు (ఆర్డినెన్స్‌) 2020 జూన్‌ 5న జారీ చేసింది. అదే ఏడాది నవంబర్‌లో పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదింపజేసుకుంది. 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రైతులు ఉవ్వెత్తున ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో 2021 జనవరి 12న వాటి అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. రైతుల ఆందోళనలతో మోడీ సర్కారు 2021 నవంబర్‌ 19న చట్టాలను ఉపసంహరించుకుంది. డిసెంబర్‌ 1న పార్లమెంట్‌లో చట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందింది.
 

                                                                             ఆర్నెల్లలోనే...

నల్ల వ్యవసాయ చట్టాల్లోని ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) చట్టం రాష్ట్రాలు చేసిన ఎఎంసి చట్టాలను పూర్తిగా హైజాక్‌ చేసింది. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ కమిటీల వెలుపల దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తుందన్నది కేంద్రం ఉవాచ. వాస్తవానికి ఈ చట్టం వలన కార్పొరేట్లకు, వ్యాపారులకే ఉపయోగం. కేంద్రం ఆర్డినెన్స్‌ తెచ్చింది మొదలు పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి మధ్య కాలం కేవలం ఆరు మాసాలే. ఈ స్వల్ప వ్యవధిలోనే మన ఎఎంసిల ఆదాయానికి భారీ గండి పడింది.
 

11