
- ఔట్‌సోర్సింగ్‌కు 500 కోట్ల విలువైన పనులు
- మోడీ ప్రభుత్వ నిర్వాకం
- 16 మంత్రిత్వ శాఖలదీ ఇదే తీరు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు గడచిన ఐదు సంవత్స రాల కాలంలో ఐదు వందల కోట్ల రూపాయల విలువైన కీలక ప్రాజెక్టులను కన్సల్టెన్సీలకు అప్పగిం చి చేతులు దులుపుకున్నాయి. కేంద్రంలోని 16 మంత్రిత్వ శాఖలు, విభాగాలు పరిపాలనకు సంబం ధించిన వివిధ ప్రాజెక్టులను ప్రముఖ బహుళజాతి కన్సల్టెన్సీ సంస్థలకు కట్టబెట్టాయని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన రికార్డులను పరిశీలించిన ఈ పత్రిక వాస్తవాలను బయటపెట్టింది.
2017 ఏప్రిల్ నుండి గత సంవత్సరం జూన్ వరకూ ప్రైస్‌వాటర్-హౌస్‌కూపర్స్ (పీడబ్ల్యూసీ), డెలాయిట్ టచ్ తోమత్సూ లిమిటెడ్, ఎర్నస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్, కేపీఎంజీ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అమెరికాకు చెందిన మెకిన్సే అండ్ కంపెనీలకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు రూ.500 కోట్ల విలువైన 308 కన్సల్టెన్సీ ప్రాజెక్టులు ఇచ్చాయని ఆ పత్రిక వివరించింది. కేంద్ర ప్రభుత్వంలో 59 మంత్రిత్వ శాఖలు ఉండగా వాటిలో 16 శాఖలు, వాటి ఆజమాయిషీలోని 50 సంస్థలు ఈ ప్రాజెక్టులను కన్సల్టెన్సీలకు అప్పగిం చాయి. వీటిలో పెట్రోలియం-సహజవాయువు, గ్రామీణాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలు- ప్రజా ఫిర్యాదులు, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి, బొగ్గు, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, రక్షణ, పౌర విమానయానం, ప్రభుత్వ రంగ సంస్థలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్యుత్, రోడ్డు రవాణా-రహదారులు, పర్యావరణం, అడవులు-వాతావరణ మార్పు, పర్యా టకంవంటి మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి.
ఏ కంపెనీకి ఎంత ?
ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టులు పొందిన బడా కంపెనీల్లో అత్యధికంగా లబ్ది పొందిన సంస్థ పీడబ్ల్యూసీ. ఇది రూ.156 కోట్ల విలువైన 92 కాంట్రాక్టులు సంపాదించింది. డెలాయిట్ కంపెనీ రూ.130.13 కోట్ల విలువైన 59 పనులు చేసింది. అయితే ఈ కాంట్రాక్టుల్లో నాలుగు కాంట్రాక్టులకు సంబంధించిన సొమ్ము వివరాలు తెలియలేదు. ఇక ఈ అండ్ వై సంస్థ రూ.88.05 కోట్ల విలువైన 87 కాంట్రాక్టులు దక్కించుకోగా వాటిలో ఐదింటికి సంబంధించిన సొమ్ము వివరాలు అందలేదు. కేపీ ఎంజీ కంపెనీ రూ.68.46 కోట్ల విలువైన 66 కాంట్రాక్టులు పొందింది. వీటిలో ఐదు కాంట్రాక్టు లకు సంబంధించిన వివరాలు తెలియలేదు. మెకిన్సే సంస్థ రూ.50.09 కోట్ల విలువైన మూడు కాంట్రాక్టులు చేజిక్కించుకుంది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ, దాని పరిధిలోని నాలుగు పీఎస్‌యూల నుండి పెట్రోలియం రంగం అత్యధిక కాంట్రాక్టులు సంపాదించింది. వీటి విలువ రూ.170 కోట్లు. విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన తొమ్మిది సంస్థలు బహుళజాతి కన్సల్టెన్సీ కంపెనీ లకు రూ.166.41 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఔట్‌సోర్సింగ్ ఇచ్చింది. ఆర్‌టీఐ చట్టంలోని 'వాణిజ్య రహస్యం' అనే కారణం చూపి సమాచారం అందిం చేందుకు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరాకరించింది.
పర్యాటక మంత్రిత్వ శాఖ తన 'స్వదేశ్ దర్శన్ ఇనిషియేటివ్'లో భాగంగా కనీసం రూ.18 కోట్ల విలువైన పనిని ఒక్క ఈ అండ్ వై సంస్థకే అప్పగిం చింది. ఇదిలావుంటే నిటి ఆయోగ్ 2019-2021 మధ్య ఏడు కాంట్రాక్టుల్ని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను మదింపు చేసేందుకు ఇచ్చిన ఈ కాంట్రాక్టుల విలువ రూ.17.43 కోట్లు.
2015 నుండే ప్రారంభం
2015 నుండే నరేంద్ర మోడీ ప్రభుత్వం కన్సల్టెంట్లకు పనులు అప్పగించడం మొదలు పెట్టిందని అప్పట్లో పత్రికలు వార్తలు అందించాయి. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం కన్సల్టెన్సీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టింది.
ఈ సంస్థలకు మార్చితో అంతమైన సంవత్సరంలో రూ.500 కోట్లు ఫీజుగా సమర్పించారని సీనియర్ కన్సల్టెంట్లను ఉటంకిస్తూ 'ఎకనమిక్ టైమ్స్' పత్రిక 2015 జూలైలో తెలిపింది. సంవత్సర కాలంలో ప్రభుత్వ సంస్థలు ఇచ్చే కాంట్రాక్టుల విలువ రూ.750 కోట్లకు చేరుతుందని వారు అంచనా వేశారు. దాదాపు అన్ని ప్రభుత్వ ప్రాజెక్టులకు కన్సల్టెంట్లను ఏదో ఒక దశలో నియమించారు. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఇదే తంతు కొనసాగింది.