Jul 18,2022 07:28

ఒకే కాలంలో ఒకే సమయంలో ఒకే రకపు వాతావరణం అనుభవంలోకి వచ్చినప్పుడు, దాని పర్యవసానాల మీద, ప్రభావాల మీద ఎక్కువమంది ఆలోచనలు కేంద్రీకృతమవుతాయి. ఆ సామూహిక, సార్వత్రిక వాతావరణంలో ఒక వ్యక్తి పొందే అనుభవం అతడి / ఆమె స్పందనగా వెలువడుతుంది. వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు తలస్నానం చేయించిన వర్ష రుతువు ఒక విశాల బాహుళ్యపు అనుభవం. దీనిపై కవులు, కవయిత్రులూ తమదైన శైలిలో స్పందించి, ఆకాశ ధారలకు సమాధానంగా తమ మనోసీమల నుంచి కవిత్వ జలపాతాలను ఉరికించారు. వివిధ సాహిత్య సమూహాల్లో విస్తారంగా కవిత్వం కురిపించారు. పదాల చినుకులతో హృదయాలను ఉరకలెత్తించారు.

సృజన క్షేత్రంలో వర్షావిష్కరణ
వాన సహజంగానే రకరకాల చిత్రాలను సృష్టిస్తుంది. అనేకనేక దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. వర్షం ఎప్పుడూ అందరికీ ఒకేలాంటి అనుభవాన్ని ఇవ్వదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలనమే కవి స్వీయ అనుభవాన్ని, ప్రతిభను జోడించుకొని విభిన్న, వినూత్న స్వరాలుగా ధ్వనిస్తుంది. ''మింటి నుంచి మీ ఇంటికి వచ్చిన అతిథి కదా వర్షం/ రండి ... వర్షాన్ని మనింటి తేనీటి విందుకు పిలుద్దాం'' అన్న డాక్టర్‌ సంపత్‌రావు మాటలతో ఈ కవితా పరామర్శను ప్రారంభిద్దాం.

వాన ఎలా కురుస్తోంది? ''వరుణుడు నింగికి జల్లెడ పట్టి/ పద్ధతిగా నీటి చుక్కల్ని జల్లిస్తున్నట్టు/ చప్పుడు లేకుండా సన్నటి జడివాన''లా కురుస్తోంది అంటున్నారు కవయిత్రి దయయంతి పోలిన. ''పుడమి పెళ్లి కూతురికి/ పసుపు స్నానం చేయిస్తున్నట్టు ఉంది ఈ వాన'', ''రాత్రీ పగలూ ఏకధాటిగా కురిసే వర్షం/ వెన్నెలను తోడు తెచ్చుకొని మరీ మురిసే ఆకాశం/ కవులకు, కల్పనలకు ముసురు ఒక అవకాశం'' అని వాన సౌందర్యాన్ని, కవుల కర్తవ్యాన్ని చెప్పారు. అంతే కాదు; ఎడతెరిపి లేని వర్షం ''కష్టజీవికి అశనిపాతం'' అని కూడా అన్నారు. ''వర్షం ఆగకుండా వాకిట్లో కురుస్తోంది/ కొన్ని జ్ఞాపకాలు మనసునంతా తడిగా మారుస్తాయి'' అంటున్నారు రాజేశ్వరరావు లేదాళ్ల. తన బరువైన జ్ఞాపకాలను వర్షం తాకిడి వెలికి తెస్తోంది. ''చినుకులు ముద్దాడిన చల్లగాలి కిటికీ గుండా లోపలికి వస్తుంది/ నా పాత గురుతునొకదానికి గుట్టుగా విప్పుకుంటాను/ ఏళ్లకేళ్లు వెనక్కి వెళ్లిపోతాను/ కాలాన్ని దాటుతూ వెనక్కి వెళ్లడమంటే/ మనసును మోసుకుంటూ గుంభనంగా దు:ఖించటమే!'' అట. బయట పడుతున్న వాన కవి మనసులో దు:ఖ స్మృతిగా  కురవడంతో ఈ కవిత ముగిసింది. కవి సుమన్‌ గౌడ్‌ వర్షం ఏమేమి చేస్తుందో వర్ణించారు. వర్షపు భావచిత్రాలను ఆవిష్కరించి, పరవశించారు. అంతటితో ఆగిపోతే కవికి ప్రత్యేకమైన చూపేదీ అనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకే తన కవితకు పరమార్థాన్ని ఆపాదిస్తూ ...''గూడు లేని అరణ్యంలో తల దాచుకోలేని ప్రాణులెన్నో/ వాటికి ఆహారం అయితే బాగుణ్ణు ఈ అక్షరాలు'' అన్నాడు.

అనుభవాలు అనేక విధాలు
విఆర్‌ తూములూరి వర్షాన్ని పరికించిన తీరు బహుముఖంగా కనిపించింది. ''అతనన్నాడు/ ఈ వానలో/ పకోడీలు తింటే ఎంత మజానో/ ఆమె అంది/ ఆ పకోడీలు కనుక/ మీరు చేస్తే మరింత మజా కదా''. ఒక టీవీ ప్రకటన స్ఫురణతో మొదలైన ఈ ముచ్చట ఆ తరువాత మరికొన్ని దృశ్యాలను చూపిస్తుంది. ''అతనన్నాడు/ నీళ్లు కురిసే చోట / బోళ్లు పెట్టవే / ఆమె అంది/ గుడిసెకున్న కంతలన్ని బోళ్లు/ నేనక్కడ తేనూ''. ఈ చిన్ని ముచ్చటతో మనకు వర్షాకాలంలో తలెత్తే పేదల పాట్లు, అగచాట్లూ కనిపిస్తాయి. ''అతనన్నాడు/ వానధాటికి/ ఇళ్లూ రోడ్లూ కొట్టుకుపోతున్నాయి/ ఆమె అంది/ ఇంకేం తమరికి లాభాల మూటే కదా!''. ఏ కష్టకాలమైనా, ప్రకృతి వైపరీత్యమైనా సామాన్యులకు ఇబ్బందులను తెచ్చిపెడితే- కొందరికి మాత్రం కోట్లు కురిపిస్తాయి. ఈ కొందరిలో కార్పొరేట్లు, కొందరు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు వగైరాలుంటారు. కోవిడ్‌ కాలంలో అదానీ, అంబానీ అత్యధిక సంపన్నులుగా అవతరించటం మనం చూశాం. కవి ఈ విషయాన్నే ఇక్కడ ముచ్చటించారు. ఆమె ఏమంది? 'మనకు' లాభాల మూట అనలేదు. 'మీకు' అని కూడా అనలేదు. 'తమరికి' అంది. ఆ లాభాల మూటపై కవి తన తూష్ణీభావాన్ని, దృక్పథాన్ని ఆమె నోట పలికించారు. మొత్తంగా ఐదు విభిన్న జీవితాలను, ఆ జీవితాలపై వర్షం ప్రభావాన్ని క్లుప్తంగా, విస్పష్టంగా కళ్లకు కట్టించారు.

కష్టజీవులను కడగండ్ల పాల్జేస్తున్న వాన బీభత్స రూపాన్ని వర్ణించారు వల్లభాపురం జనార్దన. ''అదుపు తప్పిన మనిషి/ ఆగం చేస్తున్న చేష్టలకు అలకబూని/ కోపాన్ని రుచి చూపిస్తున్నదేమో!/ ఇంటర్వెల్‌ లేని నియంత/ కొరడా దెబ్బల్లా జలనాగు/ బుస కొట్టి వెంట పడింది/ వాన పద్మవ్యూహమై చుట్టుముడితే/ బక్కచిక్కిన ఎండు డొక్కలు/ వేడి నిట్టూర్పుల కన్నీళ్లతో / ఏమీ చేయలేక దిగాలుగా ముడుచుకున్నవి ..'' అంటూ స్తంభించిన జన జీవనాన్ని కళ్లకు కట్టించారు. ''ప్రకృతి చెప్పిన పాఠాన్ని బట్టీ పట్టడం కాదు/ అర్థం చేసుకొని సాగిల పడితే సంక్షేమమే!/ క్షామానికి విశ్వం నుంచి బహిష్కారమే!'' అని ముగించారు. వానని వరదలా మారనీయకుండా, ఊళ్లను, చేలను ముంచెత్తనీయకుండాా దానిని ఒడుపుగా ఆనకట్టల్లోకి మళ్లించి జీవన ధారగా మల్చుకోవాలన్నది కవి భావన. అయితే, ఇక్కడ మానవుడి అచేతనను ధ్వనించే 'సాగిల పడితే' అన్న మాట స్థానే ... మానవ మేధనూ, సాధననూ స్ఫురింపజేసే మాటను ఉపయోగిస్తే బాగుణ్ణనిపించింది. ''వాన'' పేరిట పేర్ల రాము రాసిన కవిత ఆవేదనా పర్వాన్ని ఆవిష్కరించింది. ''వాన కురుస్తున్నంత సేపూ/ కళ్లళ్ల దీపాలు వెలిగించుకుంటాను/ కలలెక్కడ ఆరిపోతాయోనని'' అని మొదలు పెట్టి '' వాన కురుస్తున్నంత సేపూ/ నేను నాలా అసలుండలేను/ అటూ ఇటూ తొణకులాడే అమ్మ గుండె చప్పుడులోనవుతాను/ నాన్న కంట్లో మునుగుతున్న బాయి మోటరవుతాను'' అంటారు. సన్నకారు రైతుల ఇంట వాన వేళ తారసపడే దృశ్యం ఇది. గొడ్డూ గోదాం, చేనూ చెలకల స్థితిని తలచుకుంటూ, వాటి సంరక్షణ కోసం తపిస్తూ, తారాడుతూ ఇంటిల్లిపాదీ తల్లడిల్లుతూనే ఉంటారు. ఆ పరిస్థితికి ఈ కవిత అద్దం పట్టింది.

ఎడతెగని వర్షం సృష్టించిన విషాద చిత్రాలు గరికపాటి మణిందర్‌ కవితలో కనిపిస్తాయి. ''ఊరిలోకి నడిచొచ్చింది ఏరు/ గుడిసెలు తాటాకు పడవలయ్యాయి''. ఇది మనసును కలచివేసే దృశ్యం. వర్షం కురిసే వేళ వేడి వేడి పకోడీ గురించో, కాల్చిన మొక్కజన్న కండెల గురించో చాలామంది ఉవ్విళ్లూరతారు. కానీ, ఈ కవి చూపిస్తున్న దృశ్యం వేరేగా ఉంది. ''మొక్కజన్న పొత్తులో పకోడీలో/ ప్రభువు కెరుక/ మొలలోతు నీటిలో వీధి బోరింగు దగ్గర/ బురద దప్పికను దోసిళ్లతో గొంతులోకి ఒంపుకున్నారా?'' అని ఆరా తీస్తున్నాడు. ఇది ''కడుపు మంటను ఆర్పలేని వాన/ శ్రమ జీవుల చేతులను విరిసేసిన వాన/ బడుగు అడుగు బతుకులను కూలదోసిన వాన'' అంటూ బాధాకర వాస్తవాలను వెల్లడించాడు. అవని శ్రీ వినిపించిన 'వాన బుగులు' కవిత కూడా ఇలాంటి ఒరవడిలోనే సాగింది. ''వాన వస్తుందంటే చాలు/ మా వాడల పొంటి గుడిసెకున్న తాటాకు మట్టలు/ కొట్టుకు పోతాయని దిగులు/ తడిసిన మట్టిగోడలు కూలిపోయి/ పసికందులు మరణిస్తారని బుగులు'' అని తన దిగులును ఏకరువు పెట్టాడు. ''వాన బయటక్కటే కాదు/ పేదోడి లోపల లోలోపల ఎప్పటికీ ఎడతెగకుండా కురస్తనే ఉంటది'' అని వాపోయాడు.

చినుకు చిందుల్లో సౌందర్యం
అసలు వాన కురవడం ఎంత అందంగా ఉంటుందో కదా! ప్రియమైన నేస్తం ఎడతెరిపి లేకుండా కబుర్లు చెబుతున్నట్టు, భూమి కాన్వాసు మీద నీటిరంగులతో బొమ్మలు గీస్తున్నట్టు, చెట్లకు చేలకూ ఆకాశం తలస్నానం చేయిస్తున్నట్టు! అందుకే అన్నాడు కొప్పుల ప్రసాద్‌ : ''రాత్రి వచ్చిన చుట్టంలా తెల్లవార్లూ కబుర్లు చెబుతూనే ఉన్నాది'' అని. ''తాటాకు గొడుగేసుకొని/ గేదెల్ని మొలేస్తున్నాడు/ పాలేరు పిల్లాడు/ మన వెచ్చని 'టీ' కోసం/ వాడలో పడే కష్టానికి నా పద్యపు ముద్దు'' అంటాడు మెట్టా నాగేశ్వరరావు. ''వాన నన్ను తడిపిందని/ నేను కూడా/ వానని తడుపుతున్నాను/ కవితా మేఘాల కార్కును తిప్పి'' అన్నాడు ఈ కవే! ఇలా కవులందరూ వర్షాన్ని తమ ప్రత్యేక దృక్కులతో చూడడం వల్లే మనం ఇన్ని కవితా ఫలాలను ఆరగిస్తున్నాం.

'వాన నా ప్రియురాలు' అన్నారు సరికొండ నరసింహరాజు. ''నేను ఎటు వెళితే అటే / వెంటాడే వాన / నా వెంటే వాన/ నను పెనవేసిన వాన'' ''వాన ప్రేమ కౌగిలిలో పులకరిస్తూ/ వానే నేనై నేనే వానై'' అంటూ వానలో వానతో యుగళగీతం పాడుతూ తన్మయత్వం చెందారు. వాన అన్నాక కవుల హృదయంలో ప్రణయధారలు కురవకుండా ఉండవు కదా! ''నాలుగు చినుకులు నెత్తిపై వేసుకోమని/ మనసు పోరుతుంటే/ మౌనంగా కదిలిందో జంట/ వానాకాలమంటే విరితేనెల తోట'' అన్నారు సిఎస్‌ రాంబాబు. ''మబ్బులచ్చి/ పుల్లలన్నీ తడిపేశాయి/ వంట చేసేదెలా అంటున్నదామె/ నా కౌగిలి వెచ్చదనంతో/ ఉడికించమన్నాను/ ఈ పూటకు ప్రణయ వంటకాన్ని'' అన్నారు మెట్టా. హైదరాబాదు వీధుల్లోని తన బాల్యపు, యవ్వనపు వర్షపు ధారలను గుర్తు చేసుకున్నారు ఆశారాజు. ''జోరుగా వర్షం కురిసినప్పుడల్లా/ పత్తర్‌ గట్టీలో/ ఆమె గులాబీ చెప్పులు కొట్టుకుపోయి/ మదీనా బిల్డింగు దగ్గర తేలిందే జ్ఞాపకానికొస్తుంది'' అని మధురంగా తలపోసుకున్నారు. ''అతడు - ఆమె - ప్రకృతి'' అంటూ ఒక అశ్రుపూరిత ప్రేమ ఘట్టాన్ని కవిత్వం చేశారు మాడిశెట్టి శ్రీనివాస్‌. చిరు జల్లుల్లో తడిచి మురిసే తన చిన్నారి కూతురి అంతరంగపు అల్లరి దృశ్యాన్ని కవిత్వంగా ఆవిష్కరించారు మణిందర్‌.

వాననీ, వాన స్వభావ సంభవాలనీ మనిషిలో ప్రతిబింబిస్తూ కవిత రాశారు సిఎస్‌ రాంబాబు. ''వర్షించే మేఘం/ ఆహ్లాదమూ కావొచ్చు/ ఆవేశమై రావొచ్చు/ వర్షించే కళ్లకు బాధొక్కటే తెలుసు'' అని పేర్కొన్నారు. ''దిగులు కప్పుకున్న ఆకాశం/ వానతో తెరిపిన పడుతుంది/ దిగులు నిండిన మనసేమో మాట రాని మౌనమై మిగులుతుంది/ మేఘాల దిగులంతా తాత్కాలికం/ మళ్లీ చెంగుమంటూ కదిలిపోతాయి/ దిగులు మనిషి మాత్రం తీరం చేరని అలలా మిగిలిపోతాడు'' అని ముగించారు. నిజమే కదా! ప్రకృతి తెరిపిన పడినంత సులభంగా ప్రతికూల పరిస్థితి నుంచి మనిషి బయటపడలేడు. ప్రకృతికి భిన్నమైన పరిస్థితులు అతడి ద్ణుఖానికి కారణమై ఉండడం వల్ల కాబోలు!

డాక్టర్‌ రంగయ్య పోరెడ్డి తన నానీల్లో చక్కని భావచిత్రాలను ఆవిష్కరించారు. ''మేఘాన్ని/ ఎవరబ్బా కొట్టింది/ అంత గట్టిగా/ ఇంకా ఏడుస్తోంది వెక్కి వెక్కి!''. భలే ఉంది కదా, ఈ ఊహ! ''బిడ్డ / తల్లి గారింటికి వచ్చినట్టు/ వాన ఎంతకూ / పోలేదు ఎందుకో!'' అన్నారు ఇంకో నానీలో. ''బడి గోడ/ కన్నీరు కారుస్తుంది/ వానతోనే కాదు/ పిల్లలు లేరని కూడా!'' అనటం గొప్ప భావుకత.

ఇలా వాన వేళలందు కవుల, కవయిత్రుల మనో మేఘాలు మురిసి మెరిసి కురిసిన కవితా ధారలు ఎన్నో! వాటిలో కొన్నింటిని కవిసంగమం, సాహితీ స్రవంతి, అక్షరి, బాటసారి సాహిత్య వేదిక, అక్షర చెలిమి, కవి సమ్మేళనం, తెలుగు సాహితీ వనం వంటి కవి సమూహాల నుంచి సేకరించి చేసిన పరామర్శ ఇది. ఇక్కడ ప్రస్తావనకు రాని గత వారపు వర్ష కవితలు ఎన్నో ఉంటాయి. కాలానికి అనుగుణంగా కవితా సుమాలు విరబూసే, అందులో సామాజిక దృష్టిని పరిమళించే కవులందరికీ అభినందనం. కవి మెట్టా నాగేశ్వరరావు అన్నట్టుగా ... ''వానైనా, వరదైనా కొందరికి మోదం, కొందరికి దు:ఖం. కవి పద్యం మాత్రం దు:ఖితుల పక్షాన నిలబడి కన్నీటిని వెల్లడి చేసే చాటింపు.''

- సత్యాజీ