న్యూఢిల్లీ : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో ఏర్పడిన చీలక సంక్షోభం సమస్య ఎన్నికల కమిషన్ వద్దకు చేరుకుంది. ఎన్‌సిపి, పార్టీ గుర్తు తమకే చెందాలని వాదిస్తూ శరద్ పవార్, అజిత్ పవార్ గ్రూపులు ఇసి వద్ద ఫిర్యాదు చేశాయి. తమదే అసలైన ఎన్‌సిపి అని స్పష్టం చేశాయి. అజిత్ పవార్ చేసిన పిటీషన్‌లో తాను జూన్ 30నే ఎన్‌సిపి అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు పేర్కొనడం విశేషం. ఎన్‌సిపి అధ్యక్షుడుగా అజిత్ పవార్ ఎన్నికైన విషయాన్ని జూలై 3వ తేదీతో ఉన్న లేఖ ఇప్పటికే పంపినట్లు తెలిపారు. అంటే చీలకకు రెండు రోజుల ముందే తాను అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అజిత్ పవార్ చెప్పుకున్నారు. మరో వైపు రెండు గ్రూపులు కూడా బుధవారం వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఎంఈటి బాంద్రాలో అజిత్ పవార్ గ్రూపు సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి 32 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు హజరయ్యారు. వైబీ చౌహాన్ ఆడిటోరియంలో శరద్ పవార్ గ్రూపు ఏర్పాటు చేసిన సమావేశానికి 18 మంది ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపిలు హజరయ్యారు. మిగతా ఎమ్మెల్యేలు ఈ రెండు సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఎన్‌సిపికి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
- బిజెపి అత్యంత అవినీతి పార్టీ : సుప్రియా సూలే
ముంబయి : దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపియేనని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభ సభ్యులు సుప్రియా సూలే విమర్శించారు. కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూల్చడం, ప్రలోభాలకు గురిచేసి ప్రత్యర్థి పార్టీలను చీల్చడం బిజెపికి అలవాటుగా మారిందని ఆమె ఆరోపించారు. బిజెపి అత్యంత అవినీతి పార్టీ అని కేవలం తాను మాత్రమే అనడం లేదని, దేశ ప్రజలే అంటున్నారని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.










