Sep 22,2023 14:05

ప్రజాశక్తి-పాలకొల్లు : ఈ నెల 28 నుండి 5 రోజుల పాటు బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ లో జరిగే అఖిల భారత విద్యార్ది సమాఖ్య( ఏ ఐ ఎస్ ఎఫ్) 30 వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని విద్యార్దులకు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు సీహెచ్ సుందర్, టి అప్పలస్వామిలు పిలుపునిచ్చారు. ఈ మేరకు  పాలకొల్లు ఛాంబర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మహాసభల కర్రపత్రాలు ఏఐఎస్ఎఫ్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సుందర్, టి అప్పలస్వామి మాట్లాడుతూ అమ్మఒడి, గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన పదకాలు ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం ఈ పథకాల అమలుకు రకరకాల ఆంక్షలు విధించి విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ప్రవేటు విద్యా సంస్థలల్లో పీజీ, ఎంసీఎ, ఎంబిఏ, ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు జీఓ నెంబర్ 77 తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎగనామం పెట్టారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయించే నిధులు ప్రతీ ఏటా తగ్గిస్తోందని ఎన్ఈపి 2020 అమలులో బాగంగా గ్రామీణ ప్రాంతాలలో బడుగు, బలహీనర్గాలకు చెందిన విద్యార్థులు పరోక్షంగా విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని పైగా ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు మరింత మేలు చేకూరే పరిస్థితి వుందని తెలిపారు. విశ్వవిద్యాలయాలలో మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు సతమతం అవుతున్నారని అన్నారు. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలపై ఈ మహాసభలలో చర్చ జరుగుతుందని తద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని చెప్పారు. ఈ సభలకి జిల్లా నుండి ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పట్టణ నాయకులు బి పెద్దిరాజు, ఆర్ మనిదీప్, టి అంజనా శివాని, ఎం జ్యోతీర్మై ,కే. వందన, కే అక్షియ తదితరులు పాల్గొన్నారు.