
ప్రజాశక్తి-భీమవరం : భీమవరం గాంధీనగర్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ల చిన్నాన్నను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కొత్తపల్లి సుబ్బారాయుడు పాఠశాలలో బాల్లికపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ మహిళలపై బాలికలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బేటి పడావో బేటి బచావో నినాదంతో మహిళలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మైనర్ బాలికలపై ఇలాంటి సంఘటన జరగటం చట్టాలు కఠినంగా అమలు చేయకపోవడం వలనే స్త్రీలపై హింసను ప్రేరేపించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు పేరిట పురుష ప్రాధాన్యతను పెంచే విధంగా ఈ ప్రభుత్వాలు నడుపుతున్నాయన్నారు. రాజ్యాంగం స్త్రీలకు పురుషులకు సమాన హక్కులు కల్పించిందని దాన్ని అమలు చేయడం లేదని మహిళల మీద రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా ఉన్నాయానారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగటం అవమానమని ఒక వైపు మహిళలు చంద్రయాన్-3 లో శాస్త్రవేత్తలుగా ఘనమైన పాత్రలు పోషిస్తున్న మరోవైపు బాలికలపై మహిళలపై దాడులు ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రాజు, బాలికలు పాల్గొన్నారు.