
అరకను గట్టి పొలము దున్ని
వడ్లను తెచ్చి నానా పెట్టి
మండెను గట్టి నీరును పోయగా
మూడో రోజుకు మొలకలొచ్చెను
పలుగురాళ్ళకు బొట్లను బెట్టి
మడి మొదటన పూలను పెట్టి
మట్టికి మొక్కి అలుకుడు సేయగ
మూడొద్దులకే నారుగ మొలిచెను
పచ్చని నారును లుంగలు గట్టి
దున్నిన పొలమును సదును చేసి
మాగాణాన నారును పంచి
అమ్మ లక్కలు నాటు వేయగా
కొన్ని నాళ్ళకే ఏపుగా పెరిగెను
ఎదిగిన పంటల
గడ్డి గాలం వొడిపిల్లంతా
పీకి వేయగా గంటలు గట్టిన
పైరూ అంత పచ్చగా పెరిగి
రోజులు గడవగ పొట్టలకొచ్చి
వరిసేనంత వెన్నులు పెట్టెను
గొలుసులు కట్టిన వరి కంకులను
కోయగా జూసి
కోత మిషన్‌తో పంటను కోసి
వడ్ల గింజలను రాసులు పోసి
ఐకెపిల బస్తల కెత్తెను
బస్తాలన్నీ కాంటలు వేసి
లారీలల్ల నింపిన ధాన్యం
గోదాములకు తరలిపోయెను
మడు కట్లల్ల గడ్డిని తీసి
కట్టలు గట్టి వాముగా వేసెను
వడ్లను అమ్మితే డబ్బులు వచ్చెను
ఖాతాలల్ల సిరులు కురిసెను
రైతుల ఇంట్ల నవ్వులు మెరిసెను
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
94415 61655.