Jun 29,2022 06:45

అగ్నిపథ్‌ పథకానికి కార్పొరేట్‌ రంగం మద్దతు ఇవ్వడం వెనుక కారణం తెలిసిందే. రక్షణ రంగ పరిశ్రమలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిస్తే రక్షణ ఉత్పత్తి రంగ ప్రాజెక్టులను పొందేది టాటాలు, మహీంద్రాలు వంటి బడా పారిశ్రామిక సంస్థలే. కాంట్రాక్టు సైనికులతో సాయుధ దళాలను పునర్నిర్మించడం, కాంట్రాక్టు ముగిసి సైన్యం నుండి బయటకు వచ్చిన సైనికులు పెద్ద సంఖ్యలో అందుబాటులో వుండడం వల్ల భవిష్యత్తులో వారి ప్రయోజనాలు నెరవేరతాయి.

సాయుధ దళాల్లోకి సైనికుల రిక్రూట్‌మెంట్‌ జరిగే తీరును మొత్తంగా మార్చివేసే అగ్నిపథ్‌ పథకానికి అన్ని వర్గాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యువత, మాజీ సైనికోద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుపుతున్నారు. ఇంత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, కొత్త రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియతోనే ముందుకు సాగాల్సిందిగా సాయుధ బలగాలను ప్రభుత్వం ఆదేశించింది.
            ఈ పథకం పట్ల గల అభ్యంతరాలను వివిధ రంగాల రిటైర్డ్‌ సీనియర్‌ సైనికాధికారులు, రక్షణ రంగ విశ్లేషకులు, నిపుణులు వివరించారు. అన్నింటికంటే ముఖ్యంగా, గొప్పగా 'అగ్నివీరులు' అంటూ ప్రభుత్వం పెట్టిన శీర్షిక యొక్క ప్రమాదకరమైన స్వభావాన్ని గ్రామీణ నేపథ్యం కలిగిన యువత బాగానే అర్ధం చేసుకున్నారు.
       స్వల్పకాలిక కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశ పెట్టడం వల్ల సైనికుల నైపుణ్యత, వారిలో స్ఫూర్తి తీవ్రంగా దెబ్బ తింటాయని వాదనలు తలెత్తాయి. శాశ్వత పదవీ కాలం కోసం...నాలుగేళ్ళ కాలానికే రిక్రూట్‌ అయిన వారిలో కేవలం 25 శాతం మందినే ఎంపిక చేయడమనే అంతర్గత వివక్ష, నాలుగేళ్ళ టూర్‌ ఆఫ్‌ డ్యూటీ ముగించుకున్న వారి భవితవ్యం అనిశ్చితిలో పడడం... ఈ రెండూ కూడా లోపభూయిష్టమైన ఈ పథకంలో కీలకమైన విమర్శలే.
       అయితే, అగ్నిపథ్‌ పథకంలో మరింత లోతైన కోణం ఇంకోటి వుంది. అది, ఈ పథకాన్ని సాయుధ బలగాలకు, ప్రభుత్వానికి, సమాజానికి మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. హిందూత్వ ముద్రతో భారత దేశాన్ని, ఆ దేశ సంస్థలను పునర్నిర్మించడమనే విస్తృత ప్రాజెక్టులో భాగంగా ఈ అగ్నిపథ్‌ పథకాన్ని చూడాల్సి వుంటుంది. ప్రభుత్వంలోని ఇతర విభాగాల మాదిరిగానే హిందూత్వ పాలకులు తమ సైద్ధాంతిక దృక్పథం ఆధారంగా సాయుధ బలగాల పునర్నిర్మాణానికి పూనుకుంటున్నారు. ప్రతి ఏటా ఆయుధ శిక్షణ పొందిన, సైన్యం నుండి తొలగించబడిన ఈ వేలాదిమంది సైనికులు సమాజంలోకి వచ్చి చేరుతూ వుంటారన్నది వాస్తవం. ఆ రకంగా హిందూ సమాజాన్ని సైనికీకరించాలన్న సావర్కార్‌ లక్ష్యం నెరవేరడానికి దోహదపడుతుంది.
     అంతేగాక, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సిడిఎస్‌) నియామకానికి గల ప్రామాణికాలను విస్తృతం చేశారు. దీంతో సాయుధ బలగాల ఉన్నత స్థాయి రక్షణ నాయకత్వాన్ని మరింత ఎక్కువగా రాజకీయం చేసేందుకు మార్గం సుగమమైంది. అగ్నివీరులకు ఎలాంటి శిక్షణ ఇస్తారో ఇంకా చూడాల్సి వుంది. ఎందుకంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ మాట్లాడుతూ, ''జాతీయతా భావాలు కలిగిన, జాతీయ ప్రయోజనాలు పరిరక్షించే, చట్టానికి బద్ధులై వుండే అత్యుత్తమ యువతను మీరు చూస్తారు.'' అని పేర్కొన్నారు. అంటే వారిలో హిందూత్వ జాతీయవాదం పాదుకొల్పుతారా?
        సైన్యంలో చేరాలని ఎదురు చూస్తున్న యువత ఇంత తీవ్రంగా తిరగబడడంతో ప్రభుత్వం వెంటనే హడావిడిగా కొన్ని రాయితీలిస్తూ ప్రకటనలు చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో... అలాగే రక్షణ రంగ ఉత్పత్తి యూనిట్లు, ఇతర సంస్థల్లో అగ్నివీరులకు 10 శాతం రిక్రూట్‌మెంట్‌కు హామీ ఇచ్చింది. ఇతరత్రా వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇదే తరహాలో హామీలిచ్చాయి. అయితే, ఇవేమీ కూడా అసంతృప్తిగా వున్న యువతలోని అసహనాన్ని తగ్గించలేకపోయాయి. వారికి, మాజీ సైనికోద్యోగులకూ ఇలాంటి హామీల గతి ఏమిటో బాగా తెలుసు.
        ఇప్పటికే మాజీ సైనికోద్యోగులకు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూపు-సి, గ్రూపు-డి పోస్టుల్లో వరుసగా 10, 20 శాతం రిజర్వేషన్‌ వుంది. రక్షణ మంత్రిత్వ శాఖలోని మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగానికి చెందిన రీసెటిల్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ దగ్గర వున్న డేటాను పరిశీలించినట్లైతే, ఈ కోటాలేవీ కూడా భర్తీ కాలేదని తెలుస్తోంది. గ్రూపు-సి లో మాజీ సైనికోద్యోగులు కేవలం 1.29 శాతం మందే వున్నారు. గ్రూపు-డి లో వీరి వాటా 2.66 శాతంగా వుంది. 77 డిపార్ట్‌మెంట్లకు గానూ 34 డిపార్ట్‌మెంట్ల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
       కేంద్ర పారామిలటరీ బలగాల్లో మాజీ సైనికోద్యోగులకు 10 శాతం రిజర్వేషన్‌కు సంబంధించి...2019 జూన్‌ 30 నాటికి గ్రూపు-సి లో మాజీ సైనికోద్యోగులు కేవలం 0.47 శాతం మందే వుండగా, గ్రూపు-బి లో 0.87 శాతం, గ్రూపు-ఎ లో 2.20 శాతం వున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఇంతటి పేలవమైన రికార్డు వుండడంతో, కాంట్రాక్టు ముగించుకుని బయటకు వచ్చిన అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో మెరుగైన భవిష్యత్తును కల్పిస్తామన్న హామీని ఇవ్వడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
        సాయుధ దళాల నుండి రిటైరైన తర్వాత అగ్నివీరులను తిరిగి తీసుకునేందుకు దేశంలోని అగ్రగామిగా వున్న 85 కంపెనీలను ప్రభుత్వం సంప్రదించిన నేపథ్యంలో ఇక బడా కార్పొరేట్ల నుండి అగ్నిపథ్‌ పథకానికి ప్రశంసలు వెల్లువెత్తాయి. టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, మహీంద్రా గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఆర్‌పిజి గ్రూపు చైర్మన్‌ హర్ష గోయంకా, జె.ఎస్‌.డబ్ల్యు గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌...తో పాటు పలువురు ఈ పథకాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేశారు. వాటిలో ఆనంద్‌ మహీంద్రా చేసిన ప్రకటన చాలా ప్రత్యేకంగా వుంది. ''అగ్నివీరులు సంపాదించుకునే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి అద్భుతమైన అవకాశాలను కల్పిస్తాయి. అటువంటి సుశిక్షితులైన, సమర్ధులైన, యువకులను రిక్రూట్‌ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూపు స్వాగతిస్తోంది.''
            హిందూత్వ-కార్పొరేట్‌ కూటమి కలిసి పని చేయడానికి ఇదొక చక్కని ఉదాహరణ. కార్పొరేట్‌ రంగం ఈ పథకాన్ని పొగుడుత్ను తీరు చూస్తుంటే బడా పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం శిక్షణా పాఠశాలగా ఆర్మీ మారినట్లు కనిపిస్తోంది. అయితే, ఇక్కడ కఠోర వాస్తవం ఏమంటే, కార్పొరేట్‌ రంగం ద్వారా మాజీ సైనికుల నియామకాలు అంతంత మాత్రమేనని వేలాదిమంది మాజీ సైనికోద్యోగులు, రిటైరైన అధికారులకు తెలుసు.
       అగ్నిపథ్‌ పథకానికి కార్పొరేట్‌ రంగం మద్దతు ఇవ్వడం వెనుక కారణం సర్వత్రా తెలిసిందే. రక్షణ రంగ పరిశ్రమలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిస్తే రక్షణ ఉత్పత్తి రంగ ప్రాజెక్టులను పొందేది టాటాలు, మహీంద్రాలు వంటి బడా పారిశ్రామిక సంస్థలే. కాంట్రాక్టు సైనికులతో సాయుధ దళాలను పునర్నిర్మించడం, కాంట్రాక్టు ముగిసి సైన్యం నుండి బయటకు వచ్చిన సైనికులు పెద్ద సంఖ్యలో అందుబాటులో వుండడం వల్ల భవిష్యత్తులో వారి ప్రయోజనాలు నెరవేరతాయి. సాయుధ దళాల పునర్నిర్మాణంలో, రక్షణ సంస్థల ప్రైవేటీకరణలో కార్పొరేట్లకు వాటా వున్నట్లైతే...సరైన ఉద్యోగాలు దొరక్క, సమాజంలో తమ హోదా కోల్పోయి తీవ్ర అసహనంతో వున్నటువంటి మాజీ సైనికులను తమ వైపు తిప్పుకోవచ్చని హిందూత్వ శక్తులు ఆశించవచ్చు.
        బిజెపి కార్యాలయ భద్రత కోసం ఎవరినైనా నియమించుకోవాల్సి వస్తే అగ్నివీరులకే ప్రాధాన్యత ఇస్తానంటూ బిజెపి నేత కైలాష్‌ విజరు వర్ఘ్యా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వుంది. బజరంగ్‌ దళ్‌, హిందూత్వ దళాలకు వారిని నియమించడంలో కూడా ఇదే ప్రాధాన్యతను విస్తరించవచ్చు.
         భారత దేశంలో కీలక వ్యవస్థ అయిన సాయుధ దళాలపై జరిపే దాడే ఈ అగ్నిపథ్‌ పథకం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సి వుంది, నిరసన తెలియచేయాల్సి వుంది. ఉపసంహరించాల్సి వుంది.
                                               ( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )