Feb 05,2023 15:19

ఢిల్లీ: భారత సైన్యంలో చేరేందుకు ఉద్దేశించిన అగ్నివీరుల నియామక ప్రక్రియ విధానం మారింది. గతంలో మాదిరి కాకుండా ఇకపై మొదట్లోనే ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (సీఈఈ) ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు భారత సైన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలోనే నియామక ప్రకటన జారీ చేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌ సీఈఈ ఉంటుందని అధికారవర్గాల సమాచారం. అగ్నివీరుల నియామకానికి గతంలో మొదటిదశలో శారీరక సామర్థ్య పరీక్షలు, రెండోదశలో వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాతే ఆన్‌లైన్‌ సీఈఈ జరిపేవారు. ఇపుడు ఆన్‌లైన్‌ పరీక్షను ముందుకు తెచ్చారు. ''శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే ర్యాలీలకు అభ్యర్థులు భారీసంఖ్యలో హాజరవుతారు. రద్దీని నియంత్రిస్తూ నియామక విధానాన్ని సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి నియామక ప్రక్రియలో కొత్త విధానం అమలులోకి వస్తుంది.