
న్యాయశాస్త్రం గురించి, చట్టం గురించి రావిశాస్త్రి రచనలను ఉటంకించే సిజెఐ రమణ న్యాయ వ్యవస్థాగతమైన వర్గ స్వభావం (క్లాస్ క్యారెక్టర్) జోలికి పోయింది చాలా తక్కువ. భవనాలు, సదుపాయాలు, జడ్జిల సంఖ్య వెరసి మౌలిక సదుపాయాల పెంపుదల పైనే అత్యధికంగా కేంద్రీకరించారు. దానికో కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మధ్యవర్తిత్వ పరిష్కారం పెంచడమే గాక హైదరాబాదులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేయించారు. విస్తారంగా పర్యటన లోనూ ప్రసంగాలలోనూ ఆయన జడ్జిలను అర్థం చేసుకోవాలని... రక్షణ కల్పించాలని... చెప్పినంతగా తీర్పుల విషయంలో పదవులు, ప్రతిఫలాలు తీసుకునే విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాలని అరుదుగానే చెప్పారు.
వచ్చే వారాంతంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ పదవీ విరమణ చేస్తారు. ఆ స్థానంలో ఆయన సిఫార్సు చేసిన అత్యంత సీనియర్ న్యాయమూర్తి యు.యు.లలిత్ ఆగష్టు 27న ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘ కాలానికి ఒక తెలుగువారు మళ్లీ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించారన్న వార్తలు, వ్యాఖ్యలు, సందడీ సత్కారాలు ముగిసి ఆయన వీడ్కోలు పుచ్చుకోబోతున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థలో సిజెఐ పదవిలో ఎవరు ఎంత కాలం వుంటారనేది ముందే నిర్ణయమైపోతుందని జస్టిస్ రమణ మొదటే వ్యాఖ్యానించారు. ఇప్పుడా ఘట్టం ముగియనుంది. సిజెఐ రాజ్యాంగ న్యాయ నిర్ణయంలోనూ రాజ్యాంగ రక్షణలోనూ కీలక పాత్ర వహించాల్సి వుంటుంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు రాజ్యాంగ న్యాయస్థానాలు. ప్రజలకు న్యాయం చేయడమే గాక అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన సందర్భాల్లోనూ కింది కోర్టుల తీర్పులు తప్పుగా వున్నాయనుకునే సమయంలోనూ చక్కదిద్దవలసి వుంటుంది. పైగా రాజ్యాంగ మూల స్ఫూర్తి ఏమిటనేది నిర్వచించే అధికారం కూదా సుప్రీం కోర్టు తన చేతుల్లోనే పెట్టుకుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కూడా సిజెఐ నాయకత్వంలోని కొలీజియం చేతుల్లోనే వుంటుంది. ధర్మాసనాల నియామకం, కేసుల కేటాయింపు, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు కూడా పూర్తిగా సిజెఐ పరిధిలో వుంటాయి.
నియామకానికి ముందు..
ప్రధాని మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ మూల సూత్రాలైన లౌకికతత్వం, సమాఖ్యతత్వం, పౌర హక్కులపైన తీవ్ర దాడి చేస్తున్న పూర్వరంగంలో వీటి ప్రభావం సుప్రీం కోర్టుపై పడిన కాలమిది. వ్యక్తిగతంగా సిజెఐ ఏ మేరకు స్వతంత్రంగా వ్యవహరిస్తారనేది చాలా కీలకమవుతుంది. 46వ సిజెఐ రంజన్ గొగోరు ఈ విషయంలో ఘోరంగా విఫలవడమే గాక వ్యక్తిగతంగానూ విమర్శలు మూటకట్టుకున్నారు. నియామకాలు నామమాత్రంగా జరిగాయి. ధర్మాసనాల ఏర్పాటులో ఆయన కొందరి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కీలక కేసులన్నీ సాపేక్షంగా జూనియర్లయిన కొందరికే కేటాయిస్తున్నారని ఆయన సహచర సీనియర్ న్యాయమూర్తులే జస్టిస్ చలమేశ్వర్ నాయకత్వంలో మీడియా ముందు ఆరోపించిన సన్నివేశం కనీవినీ ఎరుగనిది. వ్యక్తిగతంగా ఆయన సుప్రీంకోర్టులో పనిచేసే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు కూడా ఎదుర్కొన్నారు. దాన్ని విచారించిన ధర్మాసనంలో తనూ వుండటం వివాదాస్పదమైంది. చివరకు ఆ కేసు కొట్టివేశారు. పదవీ విరమణ సమయంలో హడావుడిగా విచారణ సమయం పరిమితం చేసి అయోధ్య కేసును సంఘపరివార్ సంస్థలకు అనుకూలంగా తీర్పునిచ్చారు. తర్వాతి కాలంలో రాజ్యసభకు నామినేట్ అవడం న్యాయవ్యవస్థ స్వతంత్రతనే పరిహసించింది. ఆయన తర్వాత పదవి లోకి వచ్చిన ఎస్.ఎ.బాబ్డే పదవీకాలం చాలా చప్పగా నడిచిపోయింది, కొన్ని ప్రతికూల తీర్పులు కూడా వచ్చాయి. నియామకాలు జరగనేలేదు.
జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ కాలం ముందు నేపథ్యం ఇది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అన్నీ వ్యతిరేక తీర్పులు రావడం వెనక ఆయన హస్తం వుందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జగన్ సిజెఐ బాబ్డేకు లేఖ రాశారు. దాంతోపాటు అమరావతిలో ఆయన కుటుంబ సభ్యులు భూములు కొన్నట్టు కూడా కేసు పెట్టారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని చెప్పడమే గాక వార్తల ప్రచురణపైన కూడా హైకోర్టు నిషేధం విధించడం పెద్ద దుమారానికి దారితీసింది. తర్వాత సుప్రీం కోర్టు ఈ నిషేధం ఎత్తివేసినా ఈలోగా దేశవ్యాపితంగా మీడియాలో పెద్ద చర్చ నడిచింది. సోషల్ మీడియాలో జడ్జిలపై దాడులను, ప్రచారాలను అరికట్టాలనీ వారు చాలా కష్టపడి పనిచేస్తారని సిజెఐ బాధ్యతలు చేపట్టడానికి ముందే జస్టిస్ రమణ విమర్శలు చేశారు. ఈ పోస్టులపై హైకోర్టు విచారణ చేపట్టడమే గాక సిబిఐకి కేసు అప్పగించింది. నియామకానికి ముందు ముఖ్యమంత్రి లేఖపై సిజెఐ స్పందన తెలపాలని చాలామంది కోరగా అంతర్గత విచారణలో కొట్టివేసినట్టు ప్రకటించారు. ఆ విధంగా 2021 ఏప్రిల్‌లో జస్టిస్ రమణ సిజెఐ బాధ్యత చేపట్టారు. ఆయన హయాంలో ఎ.పి లో ఏదో జరగబోతుందన్న రీతిలో అనుకూల ప్రతికూల ప్రచారాలు, రాజకీయ ఊహాగానాలు రెండు ప్రధాన పార్టీలూ సాగించాయి.
రాజ్యాంగ కేసులు అక్కడే!
ఇప్పుడు పదవీ విరమణ సమయంలో చూస్తే ఆయన పదవి చేపట్టిన నాటి రాజ్యాంగ కేసులన్నీ దాదాపుగా పెండింగులో వున్నాయి. ఈ వారంలో ఎక్కువగా తేల్చడం ఎలాగూ కుదిరేపని కాదు. 370 అధికరణం రద్దు, కాశ్మీర్ విభజన చేయడాన్ని సవాలు చేసే కేసు (2019) తేలలేదు. మళ్లీ మళ్లీ లేవనెత్తగా దీనిపై కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తానని చెప్పారు గనక అది కొనసాగుతుంది. ఇక పౌరసత్వ సవరణ చట్టం, ఆధార్ ఓటర్ కార్డు లింకు, నోట్ల రద్దు అనబడే డీమానిటైజేషన్ (2016), బిజెపి కి విరాళాల వరద పారిస్తున్న ఎన్నికల బాండ్ల కేసు (2017), పెగాసస్ నిఘా (2021), ఉపా చట్టం సవాలు. ఇందులో ప్రతిదీ మన ప్రజాస్వామ్యానికి కీలకమైందే. ఆగష్టు 1 నాటికి తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనం విచారించాల్సిన కేసులు 135, అయిదుగురు జడ్జిల ధర్మాసనం కేసులు 342 పెండింగులో వున్నాయి. ఏళ్ల తరబడి వీటిని పక్కన పడేయడం పాలకుల ఏకపక్ష పోకడలకు కారణమవుతున్నది.
ప్రతికూల తీర్పులు, ప్రభుత్వానికి ఊపిరి
ఈకాలంలో సుప్రీంకోర్టు తీర్పులు కొన్ని పరస్పర విరుద్ధంగానూ కొన్ని సార్లు ప్రగతి నిరోధకంగానూ వున్నాయి. పౌరహక్కుల విషయంలో చొరవ తీసుకోవడం లేదు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వరవరరావు తదితరులు బెయిలు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. నేర నిర్ధారణ కాకుండానే ఏళ్ల తరబడి విచారణ ఎదుర్కొంటూనే వున్నారు. కొందరు చనిపోయారు. సిజెఐ రమణ పదవి చేపట్టిన కొత్తలో లఖింపూర్ కేసులో జర్నలిస్టు కన్నప్పన్ విడుదలకు ఆదేశించినా తర్వాత కొన్ని కేసుల్లో కోర్టు ఆసక్తి చూపలేదు. మళ్లీ గత నెలలో ఆల్ట్ మీడియా జుబేర్‌ను విడుదల చేయాలని ఆదేశించడమే గాక బెయిలు ఆవశ్యకతను నొక్కి చెప్పింది. జర్నలిస్టులను మరీ తప్పనిసరైన కేసుల్లో అరెస్టు చేయాలి గాని బెయిలు అన్నది సాధారణ సూత్రంగా వుండాలని కోర్టు చెప్పడంతో అందరూ హర్షించారు. ఇంతలోనే గుజరాత్ మారణకాండలో ఘోరంగా హత్య కావించబడిన ఎం.పి ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పడం ఈ ధోరణిని తలకిందులు చేసింది. తీస్తా సెతల్వాద్ వంటి వారు దురుద్దేశంతో ఈ గాయాలు మళ్లీ కెలుకుతున్నారని కూడా న్యాయస్థానం అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయగా ఆ వెంటనే గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన నూపుర్ శర్మపై అభిశంసన వ్యాఖ్యలు చేసిన ఇద్దరు జడ్జిలపై సోషల్ మీడియాలో విద్వేష ప్రచారం జరిగితే కోర్టు స్పందించలేదు. వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసుతో మళ్లీ ఆలయాల సమస్యను తిరగదోడటం 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని పరిహాసంగా మార్చినా జోక్యం చేసుకోలేదు. మొత్తంపైన లౌకికతత్వం ప్రధానమనే మాట సుప్రీం నుంచి రాలేదు. ప్రజా ప్రతినిధులపై కేసుల విషయంలో ఏదో జరిగిపోతుందని హడావుడి కనిపించినా అవన్నీ ఎక్కడివక్కడే వుండిపోయాయి.
సిజెఐ చాలా సందర్భాలలో ప్రాథమిక హక్కులు, మీడియా స్వేచ్ఛ వంటి వాటిపై చేసిన ప్రసంగాలు ఆశ కలిగించినా ఆచరణలో సుప్రీం కోర్టు స్పందన ఆ స్థాయిలో లేదు. రాజ్యాంగ భాష్యం పూర్తిగా సుప్రీం కోర్టు పరిధిలోది గనక ఇతరులు మాట్లాడటానికి లేదన్న వైఖరి కనిపించింది. చివరగా ఇటీవల వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీర్పు అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. ఎవరిపైనైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చని అరెస్టుకు ముందే అభియోగపత్రం చూపనక్కరలేదని తేల్చిచెప్పడం ప్రజాస్వామ్య న్యాయ సూత్రాలకే విఘాతంగా పరిణమించింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మదన్ బి. లోకూర్ దీంతో సూటిగానే విభేదిస్తే మరో మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు తానైతే ఇలాంటి తీర్పు ఇచ్చేవాడిని కాదన్నారు. నేరం చేయలేదని నిరూపించుకునే బాధ్యత నిందితుడిపై పెట్టడం, బెయిలు ఇవ్వాలంటే తన భవిష్యత్తులో ఇలా చేయబోడని కోర్టును ఒప్పించాలనడం న్యాయ సూత్రాలను తలకిందులు చేసింది. ఈ కాలంలో విశాఖ ఉక్కు అమ్మకంతో సహా జరగిపోతున్నా న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. కానీ జన బాహుళ్యానికి తోడ్పడే సంక్షేమ పథకాలు, నగదు బదిలీలపై మాత్రం ఉచితాల పేరుతో వ్యాజ్యం స్వీకరించి కొత్త వాదనలకు తెరలేపింది. ఈ విషయంలో పిటిషనర్ పార్టీల రద్దు చేయాలనే వరకూ వెళ్లింది. ఆ గందరగోళంపై సిజెఐ స్వయంగా ఒక ప్రకటనతో వివరణ విడుదలచేశారు.
ఈ కాలంలో చాలా ఎక్కువగా న్యాయమూర్తుల నియామకం కొనసాగింది. 250 మంది న్యామూర్తులను సుప్రీంకు గాని హైకోర్టులకు గాని సిఫార్సు చేసి ఇటీవలి కాలంలో ఒక రికార్డు నెలకొల్పారు. తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్య బాగా పెంచారు. కేంద్రానికి అభ్యంతరం వున్న అనేక మందిని ఉపసంహరించి ఆమోదయోగ్యమైన వారినే తీసుకొచ్చారు. ఇందులోనూ స్త్రీలకు ప్రాధాన్యతనివ్వాలనే సూత్రాన్ని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో అర్హులూ అనుభవజ్ఞులైన కొందరు అవకాశం కోల్పోయారు. కేంద్రంతో సామరస్యం అనే వాదన అత్యున్నత న్యాయస్థానం స్వతంత్రతపై నీలి నీడలు పరిచింది. కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు.
భవిష్యత్ బాధ్యతలు?
న్యాయశాస్త్రం గురించి, చట్టం గురించి రావిశాస్త్రి రచనలను ఉటంకించే సిజెఐ రమణ న్యాయ వ్యవస్థాగతమైన వర్గ స్వభావం (క్లాస్ క్యారెక్టర్) జోలికి పోయింది చాలా తక్కువ. భవనాలు, సదుపాయాలు, జడ్జిల సంఖ్య వెరసి మౌలిక సదుపాయాల పెంపుదల పైనే అత్యధికంగా కేంద్రీకరించారు. దానికో కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మధ్యవర్తిత్వ పరిష్కారం పెంచడమే గాక హైదరాబాదులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేయించారు. విస్తారంగా పర్యటన లోనూ ప్రసంగాలలోనూ ఆయన జడ్జిలను అర్థం చేసుకోవాలని రక్షణ కల్పించాలని చెప్పినంతగా తీర్పుల విషయంలో పదవులు, ప్రతిఫలాలు తీసుకునే విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాలని అరుదుగానే చెప్పారు. రాజకీయాలతో తన అనుబంధాన్ని, తెలుగు పత్రికలో పని చేసిన నాటి అనుభ వాలను తరచూ గుర్తు చేసుకునే సిజెఐ రమణ హయాంలో సుప్రీం కోర్టు మీడియా కోసం చేసిన దానికంటే సూక్తులు చెప్పిందే ఎక్కువ. సిజెఐ పదవీ కాలాన్ని స్తబ్దంగానే వున్నట్టు పలువురు వ్యాఖ్యానించారు. సుప్రీం ఒక కార్యనిర్వాహక న్యాయస్థానంగా మారిపోతూ రాజ్యాంగ రక్షణ బాధ్యత వెనక పట్టు పట్టించింది. సిజెఐ రమణ పదవీ విరమణ తర్వాత ప్రజా జీవితంలోకి వస్తానని చెప్పడం ద్వారా అనేక ఊహాగానాలకు తలుపులు తెరిచిపెట్టారు. ఆ సమయంలో తాను చెప్పాల్సినవి చాలా వున్నాయని కూడా అన్నారు గనక అది కూడా వింటే గాని వ్యాఖ్యానించడానికి లేదు. కాబోయే సిజెఐ యు.యు.లలిత్ మొదట్లోనే పిల్స్‌ను నియంత్రించడం గురించి, రాజ్యాంగ అంశాల కోసం ఒకే శాశ్వత ధర్మాసనం గురించి మాట్లాడుతున్నారు. మరి భవిష్యత్తు ఎలా వుండేది చూడాల్సిందే.
తెలకపల్లి రవి