
భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ సంచనాలు సృష్టిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్థాన్.. గత రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. 113 బంతుల్లో 10 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. అవార్డు అందుకున్న జద్రాన్ పాక్ వెనక్కి పంపేస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులకు దానిని అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించుకున్న తర్వాత లక్షలాదిమంది ఆఫ్ఘన్లు ఇతర దేశాలకు పారిపోయారు. ఈ క్రమంలో ఆశ్రయం కోరుతూ లక్షలాదిమంది పాకిస్థాన్ చేరుకున్నారు. ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ వారిని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. నవంబరులోగా దేశాన్ని ఖాళీ చేయాలంటూ డెడ్‌లైన్ విధించడంతో అక్కడున్న దాదాపు 1.7 మిలియన్ల మంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు వీరందరికీ తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అంకితమిస్తున్నట్టు ప్రకటించి తన దేశభక్తిని జద్రాన్ చాటుకున్నాడు.