వాషింగ్టన్ : జాతి లేదా స్వజాతీయత ఆధారంగా యూనివర్శిటీల్లో అడ్మిషన్లు కల్పించడాన్ని నిషేధిస్తున్నట్లు అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా స్పందించారు. జాతితో సంబంధం లేకుండా విద్యార్థులందరూ విజయం సాధించేందుకు అవకాశం ఉండేలా ఈ విధానాలు ఉండటం అత్యవసరమని ఒబామా వాదించారు. సమానత్వంతో నిండిన సమాజ నిర్మాణానికి నిశ్చయాత్మక చర్య ఎప్పుడూ పూర్తి సమాధానం కాదని పేర్కొన్నారు. అమెరికాలోని కీలకమైన విద్యాసంస్థలు, యూనివర్శిటీల్లో క్రమ పద్ధతి ప్రకారం మినహాయించబడిన తరాల విద్యార్థులకు... ఆ సీటును పొందేందుకు వారి అర్హత కంటే అదనంగా శ్రమించాల్సి వుందని ఒబామా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
యువత భవిష్యత్తు ఎలా ఉంటుందో, వారికి ఎలాంటి అవకాశాలు కల్పించబడతాయో ఆలోచిస్తుంటే తన హృదయం ముక్కలైపోతుందని మిచెల్ ఒబామా మరో ప్రత్యేక ప్రకటనలో పేర్కొన్నారు. అవే విద్యావకాశాలను పొందేందుకు ఎప్పుడూ కొంచెం ఎక్కువ శ్రమించాల్సిన విద్యార్థుల్లో ఉన్న బలం, ధైర్యం తనకు తెలుసునని, అమెరికాలోని మిగిలిన వారు కూడా అధికంగా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నారని తాను ఆశిస్తున్నానని అన్నారు.
హార్వార్డ్ యూనివర్శిటీ మరియు ఉత్తర కరోలినా యూనివర్శిటీల్లోని అడ్మిషన్ల ప్రక్రియ అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలోని సమాన రక్షణ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని డెమోక్రాట్లు తిరస్కరించగా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సహా రిపబ్లికన్లు స్వాగతించారు.










