Jul 14,2023 21:26
  • అదానీ పోర్టు ద్వారా స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు రాకుండా అడ్డుకుంటున్న వైనం

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ప్రయత్నాలకు తాజాగా అదానీ గంగవరం పోర్టు అడ్డాగా మారింది. ఉక్కు కర్మాగారాన్ని అమ్మడానికి వీల్లేదని, ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతామని 883 రోజులుగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ప్రజానీకం పోరాడుతున్నా మోడీ సర్కారు చెవికెక్కడం లేదు. పైపెచ్చు ఈ ఉద్యమాన్ని దొంగదెబ్బ తీసేందుకు కేంద్ర పాలకులు స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన రా మెటీరియల్‌ను పలు రకాలుగా అడ్డుకుంటున్నారు. అదానీ గంగవరం పోర్టు నుంచి రా మెటీరియల్‌ సరఫరా కావాల్సి ఉండగా, ఆ ప్రయివేట్‌ పోర్టును కేంద్రం అడ్డం పెట్టుకొని స్టీల్‌ప్లాంట్‌ను దిగ్బంధించాలని చూస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గంగవరం పోర్టు ద్వారా దిగుమతి అయ్యే బొగ్గును అన్‌లోడింగ్‌ చేయకుండా బెర్త్‌ మీదనే వదిలేసే నిర్ణయం తీసుకుంది. దీంతో, స్టీల్‌ప్లాంట్‌లో ఈ నెల 13న 15 వేల టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా, కేవలం 12 వేల టన్నులకే పరిమితమైంది. విదేశాల నుంచి స్టీల్‌ప్లాంట్‌ దిగుమతి చేసుకున్న రెండు బగ్గు వెస్సెల్స్‌ (ఓడలు)ను అదానీ గంగవరం పోర్టు తాజాగా బెర్తు మీదనే నిలిపేసింది. వీటిల్లో కొకింగ్‌ కోల్‌ ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతం నుంచీ స్టీల్‌ప్లాంట్‌ ఈ పోర్టు నుంచి కొకింగ్‌ కోల్‌, ఇతర రా మెటీరియల్‌ను దిగుమతి చేసుకుంటోంది. కేంద్రం తీసుకున్న వ్యూహాత్మక అమ్మకం నిర్ణయంతో గడిచిన కొద్ది నెలలుగా స్టీల్‌ప్లాంట్‌ ఆర్థిక పరిస్థితి దినదినగండంగా మారింది. ఈ నేపథ్యంలో రూ.50 కోట్లు కార్గో హ్యాండ్లింగ్‌ ఛార్జీలను ఈ పోర్టుకు స్టీల్‌ప్లాంట్‌ బకాయి పడింది. బకాయి చెల్లించాకే నౌకల నుంచి బొగ్గును తీసుకెళ్లాలంటూ స్టీల్‌ప్లాంట్‌కు షరతు పెట్టింది. హాట్‌ మెటల్‌ (స్టీల్‌) ఉత్పత్తికి కొకింగ్‌ కోల్‌ కీలకమైనది. రష్యా నుంచి ఒక నౌకలో 75 వేల టన్నుల కొకింగ్‌ కోల్‌ ఈ పోర్టుకు చేరుకుంది. ఆస్ట్రేలియా నుంచి కూడా ఈ పోర్టుకు అదే స్థాయిలో కొకింగ్‌ కోల్‌ వచ్చింది. ఇదంతా స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లాల్సి ఉన్నా పోర్టు యాజమాన్యం అడ్డుకుంది.

  • 1200 ఎకరాల ప్లాంట్‌ భూమి తీసుకున్న గంగవరం పోర్టు

2000 దశకంలో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ నుంచి గంగవరం ప్రయివేట్‌ పోర్టు కోసం నాటి టిడిపి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి 1200 ఎకరాల భూమిని తీసుకుంది. పోర్టు ఏర్పాటు కోసం ఇచ్చిన భూమికి వాటా కింద పోర్టులో ఓ బెర్తు ఇవ్వాలన్న డిమాండ్‌ను స్టీల్‌ప్లాంట్‌ ఆనాడే చేసినా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒత్తిడి చేసి ఎస్‌.రాయవరం వద్ద భూమికి భూమి ఇచ్చారు. ఆనాడే బెర్తు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు తాజాగా ఆవేదన చెందుతున్నారు. నాడు చంద్రబాబు భూమికి భూమి పేరుతో స్టీల్‌ప్లాంట్‌కు ఇచ్చిన భూమి ఎందుకూ పనికిరాదని, స్టీల్‌ప్లాంట్‌కు తన వాటాగా గంగవరం పోర్టు నుంచి బెర్తును తీసుకుని ఉంటే ఈ రోజు ఈ సమస్య తలెత్తేది కాదని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు కెఎం.శ్రీనివాస్‌ 'ప్రజాశక్తి'కి తెలిపారు.