May 15,2023 19:06

 న్యూఢిల్లీ: అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులకు (క్యూఐబీ) షేర్ల విక్రయం ద్వారా మొత్తం రూ.21,000 కోట్లు సమీకరించనున్నట్లు గౌతమ్‌ అదానీకి చెందిన రెండు కంపెనీలు ప్రకటించాయి. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.12,500 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ రూ.8,500 కోట్లు సమీకరించనున్నాయి. ఈ ప్రతిపాదనలకు ఇరు కంపెనీల బోర్డులు శనివారం ఆమోదం తెలిపాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ బోర్డు సైతం నిధుల సమీకరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. సమావేశం ఈనెల 24కు వాయిదా పడింది. యూరప్‌, పశ్చిమాసియా దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌కిదే అతిపెద్ద నిధుల సమీకరణ కానుంది. అదానీ గ్రూప్‌ చాలాకాలంగా అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడటంతోపాటు అక్రమ విధానాల్లో కంపెనీల షేర్ల ధరను కఅత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని హిండెన్‌బర్గ్‌ జనవరి 24న విడుదల చేసిన నివేదికలో ఆరోపించింది.