
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఆదానీ డేటా సెంటర్, చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు, మూలపేట (భావనపాడు) పోర్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీటి రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయని ప్రకటించారు. అంతేగాక ఇటీవల విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహించామని, దీని వల్ల ఉత్తరాంధ్రకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రానున్నదని, దీనికి తోడు విశాఖ పరిపాలనా రాజధాని కానుండడంతో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. అందుకోసమే వచ్చే సెప్టెంబర్ నుండే విశాఖ నుండే పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
ఈ మాటలు ఉత్తరాంధ్రకు కొత్తేమీ కావు..అనేక దశాబ్ధాల నుండి పాలకులు అందమైన మాటలతో ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లు జరిపి ఉత్తరాంధ్రకు రంగుల స్వప్నం చూపించారు. ఎడ్యుకేషన్ హబ్, ఐటి హబ్, ఫిన్‌టెక్ సిటీ, హెల్త్ సిటీ ...ఇలా... అనేక మాటలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి మొండి చెయ్యి చూపారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే బాటలో కొనసాగుతున్నది. అయితే ఈ రెండు ప్రభుత్వాల ఉమ్మడి లక్ష్యం ఏమిటంటే అభివృద్ధి పేర ఉత్తరాంధ్రలోని భూములు, ఖనిజ సంపద, సహజ వనరులు, సముద్రతీరాన్ని బడా సంస్థలకు కట్టబెట్టటమేనని గత అనుభవం తెలియజేస్తున్నది. ఉదాహరణకు బడా కార్పోరేట్ సంస్థలైన అదానీ, జిఎంఆర్‌ల విషయంలో టిడిపి, వైసిపిలది ఒకే వైఖరి. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకరికొకరు విమర్శించుకుంటారే తప్ప అధికారంలోకి రావడంతోటే ఈ సంస్థలకు భారీగా సంపదను దోచిపెడుతున్నారు. దీనికి అభివృద్ధి ముసుగు తొడుగుతున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కథనే చూద్ధాం. ఈ విమానాశ్రయం ఏర్పాటు పెద్ద అవినీతి పుట్ట. గతంలో చంద్రబాబు నాయుడు దీనిని తెరమీదికి తెచ్చారు. వాస్తవంగా 2017 మొదటి టెండర్లలోనే భారత ఎయిర్‌పోర్టు అధారిటీ (ఏఏఐ) విమానాశ్రయ నిర్మాణం, నిర్వహణను చేజిక్కించుకుంది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ఆదాయంలో 30.2 శాతం, ఎయిర్‌పోర్టులో 26 శాతం ఈక్విటీ హక్కులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని ఏఏఐ టెండర్‌లో తెలిపింది. అంతేగాక ఎకరానికి లీజు క్రింద ఏడాదికి రూ.20వేలు చొప్పున రూ.5.40 కోట్లు కూడా చెల్లిస్తామని తెలియజేసింది. ఒప్పందం ప్రకారం ఏఏఐకి భోగాపురం ఎయిర్‌పోర్టును ఇచ్చినట్లయితే మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభమై ఉండేది. వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి. ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలు ఏర్పడటంతో పాటు సర్వీస్‌రంగం అభివృద్ధి అయ్యేది. విమానాశ్రయం ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకు పున:పంపిణీ అయ్యేది. ఆ ప్రాంతం కొంతమేరకైనా.. అభివృద్ధి అయి ఉండేది. కానీ ఏఏఐకి దక్కిన విమానాశ్రయ టెండర్‌ను చంద్రబాబు కుట్రతో రద్దు చేశారు. జిఎంఆర్‌కి దొడ్డిదారిన కట్టబెట్టి 2019 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు ఒప్పందాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసి చివరికి జిఎంఆర్‌తో రహస్య సంధి చేసుకొని నాలుగేళ్ల తరువాత గత వారం రెండోసారి శంకుస్థాపన చేశారు.
భోగాపురం విమానాశ్రయాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపి గడిచిన ఎనిమిదేళ్లలో చేసిన రియల్ ఎస్టేట్ దందా అంతాయింతా కాదు. తెలుగుదేశం వారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అగ్రనాయకులు వందల ఎకరాల భూమి ముందస్తుగా కొనుగోలు చేసి పెద్దఎత్తున రిసార్ట్స్, లే అవుట్‌లు వేసి వేలకోట్లు సంపాదించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత విమానాశ్రయానికి కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని తగ్గించి దానిని వైసిపి అగ్ర నాయకులు రియల్ ఎస్టేట్ చేసి వేలకోట్లు సంపాదించారు. రైతులను భయపెట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఇంకా ఈ భూ దందా కొనసాగుతూనే ఉంది. చివరికి అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల తీవ్రంగా నష్టపోయిందెవరంటే రైతులు, వ్యవసాయ కూలీలే.
తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు వ్యవహారం చూద్దాం. ఈ నీటి ప్రాజెక్టును డిసెంబర్ 2024 నాటికి పూర్తి చేస్తామని, దీని ద్వారా విజయనగరం జిల్లా పూసపాటి రేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లో 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24710 ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి ఘనంగా చెప్పారు. దశాబ్ధాల నుండి ఈ నీటి ప్రాజెక్టును మూలనపడేశారు. ఇప్పుడు ఆఘమేఘాల మీద రూ.94 కోట్లు కేటాయించి ప్రజల కోసమే తమ ప్రభుత్వం ఉందని గొప్పలు చెబుతున్నారు. అసలు ఉద్దేశ్యం ఏమిటీ? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచినీరు అవసరం. అంతేగాక విమానాశ్రయం అంతర్ భాగంగా 500 ఎకరాల్లో ప్రైవేట్ స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు వంటివి అనేకమైనవి నిర్మాణం కాబోతున్నాయి. వీటికి తోడు వైసిపి, టిడిపి అగ్రనాయకుల ఆధ్వర్యంలో ఉన్న వేల ఎకరాల రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు, రిసార్స్ట్‌కు, భారీ వ్యాపార, వాణిజ్య , రిక్రియేషన్ కార్యకాలాపాలకు మంచినీరు అవసరం. అందుకోసమే ముఖ్యమంత్రికి ఈ ప్రాజెక్టు మీద ఇంత ప్రేమ కలిగింది.
ఇక నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనేక దశాబ్ధాల నుండి ఉత్తరాంధ్ర తీవ్ర వివక్షతకు గురౌతూనే వున్నది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ నాలుగేళ్లలో ఒక చిన్న నీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదు. 2019-2022 మధ్య ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన 9 నీటి ప్రాజెక్టులకు కేవలం రూ.543 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2023-2024 బడ్జెట్‌లో రూ.394 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగోవంతు కూడా ఖర్చు చేస్తారనే గ్యారంటీ లేదు. ఈ నిర్లక్ష్యం వల్లే వంశధార, తోటపల్లి బ్యారేజి, నాగవళి రివర్, జంఝావతి, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, మడ్డువలస రిజర్వాయర్ రెండోదశ, గజపతినగరం బ్రాంచి కెనాల్ వంటి అనేక నీటి ప్రాజెక్టులు దశాబ్ధాల తరబడి పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తికాకుండా ఉన్నాయి. జలయజ్ఞంలో భాగమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భారీ నీటి ప్రాజెక్టు నేటికీ అతిగతీలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు నీటి సదుపాయం కలిగేది. కానీ పాలకుల దృష్టిలో నీటి ప్రాజెక్టుల కన్నా ప్రైవేటు విమానాశ్రయాలే అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయి.
ఇక జగన్‌మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పోటీపడి చెపుకుంటున్న ప్రాజెక్టు అదానీ డేటాసెంటర్. నిని ఆదానీ పుత్రరత్నాలతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీని కథ కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లాంటిదే. సుమారు రూ.4500 కోట్లు విలువ గలిగిన భూమిని అదానీకి సమర్పించి ఎన్నో రాయితీలిచ్చారు. ఇంకా వందల ఎకరాల భూమి ధారదత్తం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. అంతేగాక శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం చేయబోతున్న మూలపేట పోర్టును కూడా అదానీకే కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనపిస్తున్నది. ఎందుకంటే విశాఖలో ఉన్న గంగపోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను కూడా అతి తక్కువ ధరకే అదానీ పరం చేశారు. అందువల్ల భావనపాడు పోర్టు విషయంలో కూడా ఇదే వైఖరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే విశాఖ ప్రభుత్వ రంగంలో పోర్టును కూడా కేంద్ర బిజెపి సహాయంతో కబలించటానికి ఆదానీ అనేక
కుట్రలు చేస్తున్నాడు. స్థూలంగా వీరి విధానాల వల్ల మొత్తం ఆంధ్రతీర ప్రాంతం మీద ఆదానీ గుత్తాధిపత్యంలోకి వెళుతున్నట్లు స్పష్టమవుతున్నది.
విస్తారమైన అటవీ గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్ర మరొక ప్రత్యేకత. ఉత్తరాంధ్ర జనాభాలో 13శాతంపైనే గిరిజనులున్నారు. ఇతర తరగతులతో పోలిస్తే అన్ని విషయాల్లో బాగా వెనుకబడి ఉన్నారు. వీరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు లేకపోగా వీరి బతుకులను చిద్రం చేసే చర్యలకు పూనుకుంటున్నారు. తాజాగా అల్లూరి, మన్యం జిల్లాల గిరిజన ప్రాంతాల్లో, అనకాపల్లి జిల్లాలో గ్రీన్ విద్యుత్ పేర అదానీకి వేలాది ఎకరాలు ధారదత్తం చేశారు. మైనింగ్‌కి మరల కుట్రలు పన్నుతున్నారు. అటవీ హక్కుల చట్టాలన్నింటినీ నీరుగార్చేస్తున్నారు.
ఉత్తరాంధ్రకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. దాదాపు 375 కిలోమీటర్ల పొడవు గల సముద్రతీరం ఉంది. తీరప్రాంతాన్ని ఉపయోగించుకొని ఉత్తరాంధ్రను బ్రహ్మండంగా అభివృద్ధి చెయ్యొచ్చు. గత కొనేళ్లుగా తీరప్రాంతం పెట్టుబడి దురాక్రమణకు గురౌతున్నది. ప్రజల ప్రయోజనాల కన్నా పెట్టుబడుదారుల లాభాలే ముఖ్యంగా తీరప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారు. తీరప్రాంత పొడవునా లక్షలాది మత్య్సకారులున్నారు. వీరి అభివృద్ధి ఎక్కడవేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంది. ఇటీవల ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చాలా గొప్పగా చెప్పుకున్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఉత్తరాంధ్రలో ఒకే ఒక ఫిషింగ్ హార్బర్ ఉందంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో నాలుగు చోట్ల ఫిషింగ్ హార్భర్‌లు నిర్మిస్తామని చెప్పారు. ఒక్కటీ నిర్మాణం చేయలేదు. ఫిష్‌ల్యాండ్‌లు కూడా ఎక్కడా కొత్తగా నిర్మాణం చేయలేదు. గంగవరం పోర్టు నిర్వాసితులకు ఫిష్‌లాండింగ్ జెట్టి నిర్మిస్తామని ఒప్పందం చేసుకొని 20ఏళ్లు దాటినా నేటికీ అతీగతీలేదు. ఇక మానవ వనరుల అభివృద్ధిలో గత ఏడు దశాబ్ధాల నుండి రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలోనే ఉత్తరాంధ్ర కొనసాగుతున్నది.
ఈ వెనుకబాటు తనానికి తగిన వ్యూహం, దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించకుండా, వికేంద్రీకరణ చర్యలు చేపట్టకుండా, బడ్జెట్‌లో తగిన విధంగా నిధులు కేటాయించకుండా, మానవాభివృద్ధి సూచికలు మెరుగుదల చేయకుండా నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించకుండా ఉత్తరాంధ్ర ఎన్నటికీ అభివృద్ధి కాలేదు. అలాగే ప్రభుత్వ పెట్టుబడులు లేకుండా ప్రైవేట్ రంగంలో వచ్చే ఎయిర్‌పోర్టులు, పోర్టులు, పరిశ్రమల వల్ల ఉత్తరాంధ్రకు ఏ మాత్రం మేలు చేయకపోగా ఈ ప్రాంత ప్రజల ఆస్తిత్వాన్నే ప్రమాదంలో పడేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
డా|| బి.గంగారావు, 9490098792