'నైలునది నాగరికతలో/ సామాన్యుని జీవన మెట్టిది?/ తాజ్ మహల్ నిర్మాణానికి/ రాళ్లెత్తిన కూలీలెవ్వరు?/ ... ప్రభువెక్కిన పల్లకి కాదోరు/ అది మోసిన బోయీ లెవ్వరు?' అంటాడు మహాకవి శ్రీశ్రీ. రాజులు సకల సౌఖ్యాలతో తులతూగుతూ అద్భుత కళాఖండాలను, పెద్దపెద్ద కోటలను కట్టించేవారు. పురాతన వైభవానికి చిహ్నంగా నేటికీ అనేక కోటలు, భవంతులు మన దేశంలో కనిపిస్తాయి. రాజులు పోయినా, రాచరికాలు నశించినా... అనంతకాల ప్రవాహంలో మౌన సాక్షులుగా ఈ భవంతులు కనిపిస్తాయి. ఎర్రకోట, తాజ్ మహల్, తంజావూరు కోట వంటి అద్భుత కట్టడాలు నేటికీ సజీవ సాక్ష్యాలు. అసలు ఇలాంటి అద్భుత కట్టడాలను, కోటలను ఎందుకు నిర్మించేవారనే ధర్మసందేహం రాకమానదు. రాజులు ఏ మతానికి చెందినవారైనా ప్రజాసంక్షేమాన్ని అంతగా పట్టించుకోరు. ప్రజలు కట్టే పన్నులతో పెద్దపెద్ద భవంతులు నిర్మించుకొని విలాసాలు, వినోదాలు సాగించేవారు. ప్రజలకు రాజు పట్ల నమ్మకమైనా వుండాలి, ఆరాధనైనా వుండాలి లేదా భయమైనా వుండాలి. లేకపోతే... ప్రజలు తిరగబడతారేమోననే భయం వారిని వెంటాడేది. ఈ అభద్రతా భావంతోనే ప్రజలకు ఒక అసాధారణ వ్యక్తిగానో, దైవాంశ సంభూతునిగానో తనకు తాను చెప్పుకునేవాడు. అది ప్రజలు నమ్మాలంటే... ఏదోక అసాధారణమైన అద్భుత కార్యం చెయ్యాలి. అది తన ప్రాభవాన్ని చాటేదిగా వుండాలి. అందుకే... ఇలాంటి కోటలు, భవంతులు నిర్మించేవారు. అక్కడ రాజు గొప్పదనాన్ని శ్లాఘించడమే ప్రజల ఎజెండా.
కానీ, పెట్టుబడిదారీ విధానం వచ్చి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మొదలైన తర్వాత ప్రజా సంక్షేమం ఎజెండా అయింది. అయితే, నయా ఉదారవాద విధానాలు వచ్చాక పాలకులు ప్రజాసంక్షేమానికి చెల్లుచీటి ఇచ్చేశారు. ఫ్యూడల్ కాలంలో రాజుల సంక్షేమం కోసం అయితే, ఇప్పుడు ప్రభుత్వాలు వున్నది కార్పొరేట్ల సంక్షేమం కోసం. ''కార్పొరేట్ల సంక్షేమమే తప్ప, ప్రజాసంక్షేమం నా ఎజెండా కాదు''- అని నయా ఉదారవాదం చెబుతుంది. ఈ క్రమంలో ప్రజల్లో అసంతప్తి, తిరుగుబాటు తలెత్తకుండా... పాలకులు తమను అసాధారణమైన వారిగా చూపడం కోసం, ప్రజల ఆలోచనలను మళ్లించడం కోసం ఏదోక అద్భుతం చేయాలి. అది గతంలో ఎవరూ చేసివుండకూడదు. అలాంటి ఆలోచనల ఫలితమే నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన. అంతకు ముందు రామాలయానికి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఎందుకంటే... ఎవరూ చేయలేని పనులు నేను మాత్రమే చేశానని గొప్పగా చెప్పుకునే తాపత్రయం. ప్రజల దృష్టిని మళ్లించడం.
ముఖేష్ అంబానీ అంటిల్లా భవనం గురించి రాస్తూ... 'ఇది నాలుగు గోడల ఆశ్రయమా, సుఖ సంతోషాల స్వగహమా? నవీన భారత దేవాలయమా, దాని ప్రేతాత్మల గిడ్డంగా' అంటారు 'పెట్టుబడిదారీ విధానం- ఒక ప్రేతాత్మ కథ'లో అరుంధతీ రారు. ఇప్పుడు మోడీ కట్టే పార్లమెంటు సౌధం కూడా అంతే. తెలంగాణ ముఖ్యమంత్రి నిర్మించతలపెట్టిన అధునాత అసెంబ్లీ భవనం కానీ, చంద్రబాబు గొప్పగా చెప్పిన అమరావతి నిర్మాణం కానీ నేను మాత్రమే చేయగలననే ఫ్యూడల్ ఆలోచనల నుండి పుట్టినవే. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నవభారత నిర్మాణంలో భాగంగా మన పాలకులు అద్భుత నిర్మాణాలు చేపట్టారు. నాగార్జున సాగర్, భాక్రానంగల్ వంటివి నేటికీ ప్రజలకెంతో మేలు చేస్తున్నాయి. బిహెచ్‌ఇఎల్, స్టీల్ ప్లాంట్ వంటివీ నిర్మించారు. వీటి ద్వారా లక్షలాదిమంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. మరి మోడీ అద్భుతంగా చెప్పే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పటేల్ విగ్రహం గానీ, రామమందిర నిర్మాణం గానీ, ఇప్పుడు పార్లమెంట్ భవనం కట్టడానికి సమాయత్తం కావడంగానీ దేనికి సంకేతం? ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చేసిందేమీలేదు కనుక ప్రజలకు ఏవో అద్భుతాలు చూపించడం ద్వారా 'నేనే గొప్ప' అని ప్రచారం చేసుకోవాలి. అందులో భాగమే ఈ నిర్మాణాలు. నాటి రాజులు కట్టినా, నేటి పాలకులు కట్టినా అద్భుత భవనాలతో ప్రజల ఆకలి తీరదు. ప్రజలకు ఉపాధి కల్పించాలి. ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుతుంటే, నాయకులు రాచరిక సంస్కతిని ప్రజలపై రుద్దుతున్నారు. ఈ అద్భుత కట్టడాలు, ఆడంబరాల వెనుకనున్న ఫ్యూడల్ అవశేషాల నగత్వాన్ని బట్టబయలు చేయాలి.










