Aug 11,2022 21:18

ప్రజాశక్తి- యంత్రాంగం: ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవహాంతో నాగార్జున సాగర్‌ 26 గేట్లను గురువారం ఉదయం పైకి ఎత్తారు. 4.22 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా..అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.90 అడుగులకు చేరింది. పులిచింతలకు 3.44 క్యూసెక్కుల నీరు వస్తుండగా 12 గేట్లను ఎత్తి 4.45 లక్షల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తే అవకాశం ఉంది. పులిచింతల జలాశయం నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 167 అడుగులు నమోదైంది. కఅష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని, జాలర్లు, నదిపై రాకపోకలు నడిపే బల్లకట్లు, పడవలను అధికారులు నిలిపివేశారు. అలాగే శ్రీశైలం జలాశయం పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,97,918 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలంలో ప్రమాద ఘంటికలు
గోదావరి నది వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 52.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు అప్పర్‌ స్పిల్‌ వే వద్ద 32.630 మీటర్లు, దిగువ స్పిల్‌వే వద్ద 24.520 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అక్కడి నుంచి 15 గేట్ల ద్వారా దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటికి తోడు శబరి, సీలేరు నుంచి వస్తున్న వరద నీరు చేరడంతో ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీకి భారీగా ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రస్తుతం కాటన్‌ బ్యారేజీ వద్ద 14.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. ప్రస్తుతం ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. కాటన్‌ బ్యారేజీకి చెందిన 175 గేట్లను పూర్తిగా పైకి ఎత్తేసి సముద్రంలోకి 13.88 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే ఉధృతి కొనసాగితే గురువారం అర్ధరాత్రి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం కోనసీమ జిల్లాలోని అయినవిల్లి, పి.గన్నవరం, ఐ.పోలవరం, రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం తదితర మండలాల్లోని లంకల్లోకి నీరు చేరింది. అయినవిల్లి మండలంలో ముక్తేశ్వరం వద్ద తొగరపాయ కాజ్‌వే మునిగి పోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలంలో చాకలపాలెం దగ్గర కాజ్‌వే మునిగిపోవడంతో మూడు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌ను మూసివేశారు. గోదావరి వరద నేపధ్యంలో ఎపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమ్తతమైంది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అమలాపురంలో ఎస్‌డిఆర్‌ఎఫ్‌ మొత్తం నాలుగు బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
విలీన మండలాలను చుట్టుముడుతున్న వరద
కుక్కునూరు, దాచారం, వింజరం, ముత్యాలంపాడు, సీతారామనగరం, వేలేరు మధ్య వరద నీరు భారీగా చేరి 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వింజరం, చీరవల్లి, ఉప్పేరు, దామరచర్ల, వేలేరు, బూర్గంపాడు మధ్య ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో అధికారులు బస్సు రాకపోకలను నిలిపివేశారు. దీంతో భద్రాచలం వైపు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వేలేరుపాడు మండలంలోని ప్రధాన రహదారులన్నీ జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రుద్రమకోట ప్రజలు మళ్లీ సమీపంలోని కొండ గుట్టలపై తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తిరుమలాపురం, నాళ్లవరం, చిగురుమామిడి, బోళ్లపల్లి, టేకూరు, దాచారం, కోయిదా తదితర 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలవరంలోని కడెమ్మ వంతెన, కడెమ్మ స్లూయీస్‌ గేట్లు, పోలవరం ప్రాజెక్ట్‌ చెక్‌పోస్ట్‌ వరద ముంపునకు గురయ్యాయి. దీంతో పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆచంట మండలంలో వశిష్ట గోదావరి ఉరకలేస్తోంది. ధవళేశ్వరం వద్ద గంటగంటకు నీటిమట్టం పెరగడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యలమంచిలి మండలం కనకాయలంకలో కాజ్‌వే పూర్తిగా నీట మునగడంతో అక్కడి ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.