ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం : ఆధాని కుంభ కోణం పై సమగ్ర విచారణ జరిపి బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల కోట్ల రూపాయలు తిరిగి కట్టించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆదాని కుంభకోణాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానిక ఏలూరు రోడ్ సీపీఎం కార్యలయం ఎదురుగా ప్లకార్డులతో నిరసన కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ రవి మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు దాసోహమై దేశ సంపదను దోచి పెడుతున్నారని అన్నారు. అదే కోవకు చెందిన ఆదాని భారతదేశంలోని అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు .2002 రెండులో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆదానీ మోడీ మధ్య సంబంధాలు మొదలయ్యాయని ఆ సంబంధాలతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదను దాసోహం చేస్తూ కోట్ల సంపదను నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఆదానికి దోసి పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఆదాని గుప్పెట్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బ్యాంకుల నుంచి తీసుకున్న వేలకోట్ల రుణాలను తిరిగి కట్టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరంతరం దేశభక్తితో మాట్లాడుతున్న మోదీశా ఈ దేశ ప్రజలపై పెనుబారాలు మోపుతూ దేశ సంపదను కొంతమందికి దోచిపెట్టడం, దేశభక్తా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి రైతు రంగానికి పోలవరం ప్రాజెక్టుకు నిధుల ఊసే లేదని అన్నారు. కానీ పెట్టుబడిదారీ కార్పొరేటర్లకు లక్షల కోట్లు కేటాయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే అదానిపై సమగ్ర దర్యాప్తు జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వామపక్షాలందరినీ ఐక్యం చేసి ఆదానిపై చర్యలు తీసుకునే వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు టీ దుర్గారావు, టి నాగమణి, జి వెంకట్రావు, టి సత్యనారాయణ, ఎంజీవరత్నం, బి.రాంబాబు, పసల సూర్యరావు, ఎస్కే సుభాషిని, కే భాస్కర్, జి సూర్య కిరణ్, తదితరులు పాల్గొన్నారు.










