Oct 05,2023 07:44

ప్రజాశక్తి-అమరామతి బ్యూరో : కోళ్ల దొంగతనం పేరుతో దళితుడి కాలు విరగ్గొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ జిల్లా పద్మనాభం పోలీస్‌ స్టేషన్‌లో బాందేవపురం పాపు అనే దళిత యువకుడిని కోళ్లు దొంగతనం కేసులో విచారించేందుకు తీసుకొచ్చి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి కాలు విరగ్గొట్టారని తెలిపారు. దీనికి కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలో దళితులపై దారుణమైన కుల దురహంకార దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మాస్క్‌ లేదని దళిత యువకుడిని కొట్టి చంపారని, ఇసుకపై ఫిర్యాదు చేశారని మరొక దళిత యువకుడికి శిరోముండనం చేశారని తెలిపారు. నిందితులపైనా, కారణమైన పోలీసులపైనా ఇప్పటి వరకూ ఏలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ఆందోళన, ఉద్యమాలు సందర్భంలో కొందరు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.