ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : దేశవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మాల మహానాడు ఐక్యవేదిక ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్ 4 వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించేందుకు పై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాజంపేట పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక చట్టం ప్రకారం బడ్జెట్లో పక్కదారి మళ్లించిన నిధులను తిరిగి కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సి.ఆర్.పి.సి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎస్సీ-ఎస్టీ ల పై దాడులు, హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు కేసులు విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, కోనేరు రంగారావు సిఫార్సులు అమలు చేయాలని, భూస్వాముల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని, అసైన్డ్ చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ కేంద్ర బడ్జెట్లో రూ.2లక్షలు కోట్లు కేటాయించాలని, జస్టిస్ పున్నయ్య సిఫార్సులు అమలు చేయాలని, కుల వివక్ష, అంటరానితనంపై ప్రభుత్వమే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని, స్మశానాలు లేని దళిత గ్రామాలకు స్థలం కేటాయించాలని, డప్పు కళాకారులు, చర్మకారులకు రూ 5 వేలు పెన్షన్ పెంచి 45 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన దళిత కుటుంబానికి రెండు సెంట్లు ఇళ్ల స్థలం తో పాటు రెండు ఎకరాల సాగు భూమిని కేటాయించి పక్కా గృహ నిర్మాణానికి రూ 5 లక్షలు పెంచాలని, స్మశానాలలో పనులు చేస్తున్న కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బిజెపి మతోన్మాద శక్తులు, మనువాద కుట్రలను తిప్పికొట్టాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జయరామయ్య, పందికాళ్ళ మణి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, ఇండియన్ లేబర్ పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు మరియు మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా నాయకులు లింగం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.