- కెవిపిఎస్, వ్యవసాయకార్మిక సంఘం మహాధర్నాలో బి వెంకట్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళితుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 4వ తేది చలో పార్లమెంటు నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి బి వెంకట్ తెలిపారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మికసంఘాల ఆద్వర్యంలో దళితులకు సామాజిక న్యాయం డిమాండ్ చేస్తూ శుక్రవారం విజయవాడలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బి.వెంకట్ మాట్లాడుతూ చలో పార్లమెంటుకు ముందు దేశ వ్యాప్తంగా లక్షలాది సంతకాలు సేకరించనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో కేరళ ప్రభుత్వం దళితులను దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తోందని, దళితవ్యక్తిని దేవాదాయశాఖ మంత్రిగా నియమించారని చెప్పారు. దళితుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. ఇదే తీరు కొనసాగితే కేంద్రంలో నరేంద్రమోడీతో పాటు, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని దళితులు గద్దెదింపడం ఖాయమన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు మరింత పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సబ్ ప్లాన్ చట్ట నిధులు నవరత్నాలకు బదలాయించడం రాజ్యాంగ విరుద్దమన్నారు..
జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటి సిపార్సులు అమలు చేయాలి - వి శ్రీనివాసరావు
రాష్ట్రంలో దళితుల సమస్యల పరిష్కారానికి జస్టిస్ పున్నయ్య కమీషన్, కోనేరు రంగారావు కమిటి చేసిన సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని ఈ సందర్బంగా దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు అన్నారు. ఎస్‌సి ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకువస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ మాట తప్పారన్నారు. అలాగే దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్‌లో ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోతోందన్నారు. ఈ సందర్బంగా ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల వద్ద వున్న కొద్దిపాటి భూములు కూడా లేకుండా చేసే కుట్రలో భాగంగానే అసైన్డ్ చట్ట సవరణకు పూనుకుందన్నారు. రాష్ట్రంలో భూస్వాముల వద్ద లక్షల ఎకరాల భూములున్నాయని వాటిని పేదలకు పంచకపోతే వ్యవసాయకార్మిక సంఘం, కెవిపిఎస్‌లు జెండాలను పాతి భూములను పేదలకు పంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిబియఫ్ విసికె నాయకులు బాగ్యారావు, విద్యాసాగర్, సుమమాల రాష్ట్ర అధ్యక్షులు కన్నెగంటి బాస్కరరావు, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టి, ఐలు రాష్ట్ర నాయకులు ఆవుల వెంకట్రావు, వ్యవసాయ కార్మిక మహిళా కన్వీనర్ నాగ శివరాణి, నాయకులు కల్యాణ్, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి క్రాంతి కుమార్, కాటికాపరులు సంఘం రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు, జి నటరాజ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఉభయ సంఘాల రాష్ట్ర నాయకులు కెవి నారాయణ, అన్వేష్, పెద్దన్న, ఓ రంగమ్మ, రామదాసు, రమణ, తిరుపాలు, అరుణాచలం, బి రఘరాం, కంకణాల ఆంజనేయులు, అప్పారావు, రవిబాబు, క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు.