వాషింగ్టన్ : భారత్ నిర్వహించిన జి- 20 సదస్సు విజయవంతమైందని అమెరికా పేర్కొంది. సోమవారం అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడుతూ.. జి-20 విజయవంతమైందని కచ్చితంగా విశ్వసిస్తామని అన్నారు. జి-20 ఒక పెద్ద సంస్థ. రష్యా, చైనా లు దీనిలో భాగస్వాములుగా ఉన్నాయని అన్నారు. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మీడియా ప్రశ్నకు మిల్లర్ స్పందిస్తూ.. ఈ సదస్సులో విభిన్న అభిప్రాయాలు కలిగిన సభ్యులు ఉన్నారని అన్నారు. అయితే ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, నిబంధనలను ఉల్లంఘించకూడదన్న సందేశాన్ని డిక్లరేషన్ లో చేర్చామని అన్నారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నందున ఇది చాలా ముఖ్యమైన సందేశమని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. అణు బెదిరింపులకు పాల్పడడం కానీ, అణ్వాయుధాలు వాడడం కానీ అమోదయోగ్యం కాదు అని డిక్లరేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.