Oct 04,2023 17:43

న్యూఢిల్లీ :   ఆప్‌ ఎంపి సంజయ్  సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) బుధవారం అరెస్ట్‌ చేసింది.  బుధవారం ఉదయం నుండి ఎంపి నివాసంలో ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.  సుమారు పదిగంటల పాటు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.  ఢిల్లీ లిక్కర్‌ పాలసీ దర్యాప్తుకు సంబంధించిన  మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.  ఈ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త దినేష్‌ అరోరా అప్రూవర్‌గా మారిన తర్వాత సంజయ్  సింగ్‌ నివాసంపై ఈడి దాడులు నిర్వహించడం గమనార్హం. ఆప్‌ నేత తనను ఎక్సైజ్‌ మంత్రిగా ఉన్న మనీష్‌ సిసోడియాకు పరిచయం చేశారని అరోరా పేర్కొన్నట్లు ఈడి తెలిపింది.

ఆప్‌ పార్టీకి సంబంధించి  మూడో కీలక నేత అరెస్ట్ కావడం గమనార్హం.  నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌ చేశారనే ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌జైన్‌ను గతేడాది మేలో అరెస్ట్‌ చేశారు.  అనంతరం ఈఏడాది ఫిబ్రవరిలో కేజ్రీవాల్‌ సన్నిహితుడు, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ సిసోడియాను సిబిఐ అదుపులోకి తీసుకుంది.