న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆప్ నేత సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారిస్తోంది. ఈ కేసులో సంజయ్ సింగ్ కీలక కుట్రదారుడు అని పేర్కొనడంతో ఢిల్లీ కోర్టు ఐదు రోజుల కస్టడీకి అప్పగించింది. ఆప్‌నేతకు ఓ వ్యాపారవేత్త రూ. 2 కోట్లు ఇచ్చాడని, ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ ట్రయల్స్‌లో భాగమని ఈడి కోర్టుకు తెలిపింది. ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు పలువురు నిందితులతో సంజయ్ సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడి పేర్కొంది. సంజయ్ సింగ్ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉండేలా లిక్కర్ పాలసీని రూపొందించారని, ఇది నేరపూరిత కుట్రగా పేర్కొంది.
ఆప్ ఎంపి నివాసం నుండి డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నామని కోర్టుకు తెలిపింది. అరోరాకు చెందిన సర్వేష్ అనే ఉద్యోగి ఈ నగదును ఇచ్చినట్లు ఆరోపించింది. దీంతో ఈ కేసులో నేరుగా అతని పాత్ర ఉందని ఇడి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్ సంజయ్ సింగ్‌కు అక్టోబర్ 10 వరకు కస్టడీ విధించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేత, ఎంపి సంజయ్ సింగ్‌ను ఈడి బుధవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఇండియా కూటమి కింద ఏకం కావడంతో బిజెపికి ఓటమి భయం పట్టుకుందని ఆప్ ఎద్దేవా చేసింది. అందుకే ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా దాడులు, అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించింది.