May 02,2023 13:28

న్యూఢిల్లీ  :   ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో ఆప్‌ నేత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సోమవారం చేర్చింది. ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దా పేరును నిందితునిగా కాకుండా.. లిక్కర్‌ కేసు అనుబంధ చార్జ్‌షీటులో చేర్చింది. ఈ అనుబంధ చార్జిషీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు సంజయ్  సింగ్‌ వంటి పార్టీ ఇతర నేతల పేర్లను కూడా నమోదు చేసినట్లు సమాచారం. అరెస్టయిన మాజీ మంత్రి మనీష్‌ సిసోడియా నివాసంలో జరిగిన సమావేశంలో రాఘవ్‌ చద్దా పాల్గన్నారని ఈడి పేర్కొంది. రద్దు చేసిన మద్యం పాలసీని తీసుకురావాలనే ప్రణాళికను కొంతమంది వ్యాపారవేత్తలతో ఆ సమావేశంలో చర్చించినట్లు తెలిపింది. నూతన లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమలులో అవతవకలకు పాల్పడ్డారంటూ మనీష్‌ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ ప్రభుత్వం నూతన లిక్కర్‌ పాలసీని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. అయితే తొమ్మిది నెలల అనంతరం ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ పాలసీని రద్దు చేసింది.