మాస్కో : రష్యాలోని క్రిమియా ద్వీపకల్పంలోని సెవాస్టోపోల్ షిప్‌యార్డ్‌పై బుధవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ ఘటనలో రెండు భారీ నౌకలు ధ్వంసం కాగా, సుమారు 24 మందికి గాయాలైనట్లు రష్యా అధికారులు తెలిపారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. గత 18 నెలలుగా రష్యా ఉక్రెయిన్‌పై చొరబాటు చర్యలు చేపట్టినప్పటి నుండి క్రిమియాను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. అయితే ఇటీవల దాడుల్లో ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు.
షిప్‌యార్డ్‌పై ఉక్రెయిన్ సుమారు 10 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. అలాగే నల్లసముద్రంపై నుండి మూడు సముద్ర డ్రోన్‌లను నౌకలపై ప్రయోగించిందని పేర్కొంది. ఏడు క్షిపణులతో పాటు అన్ని సముద్ర డ్రోన్‌లను కూల్చివేశామని.. అయితే కొన్ని క్షిపణులు నౌకలను ధ్వంసం చేశాయని తెలిపింది. అయితే ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు.
ఈ దాడిలో 24 మందికి గాయాలయ్యాయని సెవాస్టోపోల్ గవర్నర్ మైఖేల్ రజ్వోజాయేవ్ బుధవారం టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.