ముంబయి: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతం ఉన్న కారణంగా ఆయా నగరాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.'' గత కొన్ని త్రైమాసికాలుగా 225 నగరాల్లో వ్యాపారం ప్రోత్సాహకరంగా లేదు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో నెలకొన్న ఈ మందగమనం ఎవరూ ఊహించినది. ఇది మా వ్యాపార వఅద్ధిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ, కంపెనీ నిర్దేశించుకున్న దీర్ఘకాల లక్ష్యాలను అందుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని జమాటో వెల్లడించింది. సేవలు నిలిపివేసిన నగరాల జాబితాను మాత్రం జమాటో వెల్లడించలేదు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గత అక్టోబరు నుంచి ఫుడ్ డెలివరీ రంగంలో వ్యాపారం మందకొడిగా సాగడమే ఇందుకు ప్రధాన కారణమని జమాటో భావిస్తోంది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా 8 నగరాల్లో ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది. ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని గత నెలలో జమాటో సీఈవో దీపిందర్ గోయల్ ప్రకటించారు. వివిధ విభాగాల్లో 800 మందిని నియమించుకుంటామని తెలిపారు. ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతేడాది చివరి రెండు నెలల్లో పనితీరు ఆధారంగా సంస్థలో మూడు శాతం సిబ్బందిని తొలగించి, ఇప్పుడ నియామకాలు చేపట్టడం మార్కెట్ గిమ్మిక్ అని పలువురు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కంపెనీ 225 నగరాల్లో సేవలు నిలిపివేయడం వల్ల మరింత మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










