Oct 14,2023 08:04

ప్రతి రోజూ
జీవన్మరణ పోరాటం
ఉండనే ఉంటుంది
సమయం ఆసన్నమైనపుడే
మన విజ్ఞతను
పోరాట పటిమను
ప్రదర్శించాల్సి వస్తుంది
గతానుభవాల వేదనలు
గడిచిన గత తాలుకా రోదనలు
పునరావృతం కాకుండా
వివేకంతో
వ్యవహరించాల్సిన తరుణమిది
తాయిలాలకు తలొంచితే
భవిష్యత్‌ తారుమారౌతుంది
ముడుపులకు మొగ్గు చూపితే
భవితవ్యం అగమ్యమవుతుంది
కానుకలకు ముచ్చట పడితే
ముందుకాలం రాబందువవుతుంది
ఐదు వేలకు ఆశపడితే
ఐదేళ్ళ వరకు
ఐదు వేళ్ళు నోటిలోకి పోక
బతుకు భారమవుతుంది
ప్రశ్నించే గొంతుకను
నిలబడే నిజాయితీని
ఎదుర్కొనే నిబ్బరాన్ని
పోరాడే స్థయిర్యాన్ని
నీ ఓటుతో ఎన్నుకో
మరలా తప్పు చేశామన్న
ఆత్మవంచన నుండి తప్పుకో
వివేకం గల ఓటరునని ఒప్పుకో.
 

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 7780277240