మనిషిని మనిషిలా చూడని సమాజంలో జీవిస్తున్నామని ఎప్పుడూ ఏదో ఒక సందర్భం మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. రంగు, భాషను బట్టి కులాన్ని అంచనా వేయడం, వేసుకున్న దుస్తులను బట్టి మతాన్ని ఆరాతీయడం, వ్యవహార శైలిని బట్టి గుర్తింపును ప్రశ్నించడం తమ నైతిక హక్కుగా భావించే వారెందరో ఈ సమాజంలో ఉన్నారు. అలాంటివారి ఇళ్లల్లో అద్దెకి దిగేందుకు వెళ్లిన వ్యక్తులకు ఎదురయ్యే అవమానాలు, అవహేళనలు అన్నీఇన్నీ కావు. అద్దె ఇంటి కోసం వెళితే - కులం, మతం, లింగ ఆధారిత వివక్ష ఎదురవ్వడం సమాజానికి సిగ్గుచేటు.
మీ కులమేంటి? మీరు ఏ దేవుణ్ణి కొలుస్తారు? నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆడ, మగా? అనే ప్రశ్నలతో పాటు ఒంటి రంగును బట్టి.. మాట్లాడే భాషను బట్టి 'మీలాంటి వాళ్లకు అద్దెకి ఇవ్వమ'ని ముఖం మీదే తలుపులేసే కుటుంబాలు బోలెడు.
కన్నగినగర్.. తమిళనాడులోని ఓ దళితవాడ. చుట్టుపక్కలన్నీ అపార్టుమెంట్లే.. ఇళ్లు తుడిచేందుకు, తోటపని చేసేందుకు, ముఖ్యంగా మరుగుదొడ్లు కడిగేందుకు ఈ బస్తీ వాసులు అపార్టుమెంట్లకు వెళ్తుంటారు. అపార్టుమెంట్లలోనే కాదు.. పక్కనున్న కాలనీలకు ఈ పనుల నిమిత్తం బస్తీ వాసులు వెళ్తారు. తాగునీరు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు లేని బస్తీలో ఎన్నాళ్లు ఉంటామని ఎవరైనా బయట ఇళ్లల్లో అద్దెకు దిగుదామంటే మాత్రం వారికి ఇళ్లు దొరకవు.

27 ఏళ్ల భీమ్‌జీ కన్నగినగర్ వాసి. నటన అతని వృత్తి. తమిళ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన పలు సినిమాల్లో నటించాడు. అతనికి ఎదురైన అనుభవం గురించి ఇలా చెబుతున్నాడు. 'నేను పని కోసం కన్నగినగర్ నుండి రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవాణ్ణి. ఒక్కోసారి రాత్రి బాగా పొద్దుపోయేది. అర్ధరాత్రైనా బస్తీకి వచ్చేసేవాడ్ని. ఇక్కడే నా కుటుంబం, స్నేహితులు ఉన్నారు. ఇది నా సొంత ప్రాంతంగా భావిస్తాను. ఇక్కడి నుండి వెళ్లిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. కాని నాకు ఇప్పుడు పెళ్లయింది. పాప పుట్టింది. ఈ సమయంలో అంత దూరం ప్రయాణించడం సాధ్యం కావడం లేదు. అందుకే అద్దె ఇంటి కోసం వెతకడం ప్రారంభించాను.
- భవిష్యత్తు ఇలా ఉండకూడదు
'అద్దె ఇంటి కోసం బయలుదేరిన నాకు, ఒంటి రంగును బట్టి, మాట్లాడే భాషను బట్టి కూడా వివక్ష ఎదురైంది. నగరంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉందని నేను ఊహించలేదు. నాకు ఒక ఇళ్లు బాగా నచ్చింది. అడ్వాన్సు ఇద్దామని యజమాని ఇంటికి వెళ్లాను. ఫోన్లో ఎంతో స్నేహపూర్వకంగా, హుందాగా మాట్లాడిన యజమాని, నేను ఇంటికి వెళ్లినప్పుడు చాలా అసౌకర్యంగా కనిపించాడు. నాతో మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కుంటున్నట్లు అనిపించింది. ఒకసారి ఇల్లు చూపించమని అడిగాను. వెంటనే అతను నన్ను కింద నుండి పై వరకు ఒకసారి చూసి ''మీరు కన్నగినగర్ నుండి వచ్చారా? అక్కడి వాళ్లకి మేం అద్దెకి ఇల్లు ఇవ్వం.'' అని ఖరాఖండీగా చెప్పేసి ఇంట్లోకి వెళ్లిపోయాడు. సౌకర్యవంతమైన ఇల్లు దొరికేసరికి రెండేళ్లు పట్టింది. నా బిడ్డ పెరిగి పెద్దయ్యేసరికి ఇటువంటి అసమాన పరిస్థితులు ఉండకూడదని ఆశిస్తున్నాను' అంటున్నాడు.

- నా గుమ్మం దగ్గరకే రావొద్దు..
13 ఏళ్ల క్రితం ట్రాన్సెజెండర్ సుభిక్ష మదురై నుంచి చెన్నైకి వలస వచ్చింది. 'నా జెండర్‌ని బట్టి నాకు అద్దెకి ఇల్లు దొరకడం చాలా కష్టమైంది. నేను ఉన్నత విద్య చదువుకుంటున్నాను. ఈ సమయంలో నాకు ప్రత్యేకంగా ఓ ఇల్లు కావాలని అనుకున్నాను. రెంటల్ యాప్స్ ద్వారా అద్దె ఇళ్లు వెతకడం ప్రారంభించాను. కనీస వసతుల్లేని మురికివాడలు, చెత్త యార్డుల పక్కన ఉన్న గుడారాలు నాకు అనువైనవని సూచించి, మధ్యవర్తులు నన్ను చాలా అవమానించారు. అయితే ఒకసారి నా అభ్యర్థనను ఆమోదిస్తూ ఓ ఫోను కాల్ వచ్చింది. అత్యవసర పరిస్థితిలో తన తల్లిదండ్రులను చూసుకుంటానని ఒప్పందం ఇస్తే ఇంట్లో ఉండవచ్చని కుటుంబానికి దూరంగా ఢిల్లీలో స్థిరపడ్డ ఓ యజమాని నాతో మాట్లాడాడు. తీరా అక్కడికి వెళ్తే ఆ యజమాని తల్లి నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ''నీలాంటి వాళ్లకి నా ఇల్లు అద్దెకి ఇవ్వను'' అని ముఖం మీదే తలుపేసింది. ఆ తరువాత చాలా కాలం నాకు ఇల్లు దొరకలేదు. నా కమ్యూనిటీ పట్ల సమాజం చాలా చిన్నచూపు చూస్తోంది. భిక్షాటన చేసేవాళ్లగానో.. సెక్స్ వర్కర్లగానో మమ్మల్ని పరిగణిస్తున్నారు. కానీ మాలో చాలామంది మెరుగైన జీవితాలను గడుపుతున్నారు. సమాజ ధోరణి మారనంత వరకు మాకు గౌరవం దక్కదు' అని సుభిక్ష చెమ్మగిల్లిన కళ్లతో చెబుతోంది.

- మీ కుల దైవం ఎవరు?
ఫర్హీన్ ముస్లిం మహిళ. అద్దె ఇంటి కోసం వెతుకులాటలో ఆమె తినే తిండి, కొలిచే దేవుడు గురించి ప్రతి చోటా ప్రశ్నలు ఎదురయ్యేవి. 'అద్దె ఇంటి కోసం నేను ఫోన్లో సంప్రదించినప్పుడు చాలా మంది 'మీరు ఎవరు? అని ప్రశ్నించేవారు. కొంతమంది మీరు మాంసాహారులా అని అడిగేవారు. ఇంకొంతమంది మీ కులదైవం ఎవరు? అని ప్రశ్నించేవారు. కొంతమందైతే నా మాట తీరును బట్టి మీరు ముస్లింలా అనేవారు. ఇలా నన్ను చూడకుండా ఫోన్లోనే సవాలక్ష ప్రశ్నలు వేసేవారు. అన్నింటికీ సమాధానం చెప్పాక నాకు మళ్లీ వాళ్ల నుండి ఫోను కాల్స్ వచ్చేవి కావు. ఎదురుచూసీ చూసీ నేనే ఫోను చేస్తే రకరకాల కారణాలు చెబుతూ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పేవారు. ఒకసారి ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. ఇంతలో ఆ ఇంటి యజమాని మీరు పెరుమాళ్‌ని పూజిస్తారా? అని హఠాత్తుగా అడిగాడు. మాకేమీ అర్థం కాలేదు. మేము ముస్లిములమని చెప్పాం. అంతే! అతనిలో చాలా మార్పు కనిపించింది. చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు. చివరికి మేము ముస్లిములకి ఇళ్లు ఇవ్వమని తెగేసి చెప్పాడు' అంటున్న ఫర్హీన్ ఇంకా ఇలా చెబుతున్నారు. 'కొంతమంది యజమానులు నా ఫోను నంబరును బ్లాక్ చేశారు. ముస్లింలు అంటే భారతీయులు కారని, ఉగ్రవాదులన్న భావన పెంచి పోషిస్తున్న మూకలు ఈ సమాజంలో చాలానే ఉన్నాయి' అంటూ ఆవేదన చెందుతున్నారు. ఏడాది ప్రయత్నాల తరువాత ఫర్హీన్ కొత్త ఇంటి కల నెరవేరింది.
చదువు కోసమో.. ఉద్యోగం కోసమో.. మెరుగైన జీవితం కోసమో ఎవరో ఒకరు.. ఎప్పుడో ఒకప్పుడు.. ఒక చోట నుండి మరో చోటికి వలస వెళ్లడం సర్వసాధారణం. అక్కడ స్థిర నివాసాలో.. తాత్కాలిక నివాసాలో ఏర్పరచుకోవడం కూడా చూస్తుంటాం. అయితే ఈ దృశ్యాల వెనుక కంటికి కనిపించని మనోవేదన ఎంతో దాగుందుంటుందని పై ఉదంతాలు తెలియజేస్తున్నాయి. సమాజం మారాలి.. మారాలి.. అంటుంటారు. కానీ మార్పు మనతోనే మొదలవ్వాలని ఎవరూ అనుకోరు. అలా అనుకోనంత వరకూ ఆ అసమానతలు ఇలానే రాజ్యమేలుతాయి.
(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)










