Sep 15,2023 09:49

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ల నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించే బిల్లును ఆమోదింపజేసుకోవడమే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ప్రధాన అజెండాగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 'ఎక్స్‌'లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తీర్పును వమ్ము చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదులుగా ప్రధాని సూచించిన మంత్రిని కమిటీలోకి తీసుకోవాలన్న బిల్లును ఆమోదించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఏచూరి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని మోడీని ఆకాశానికెత్తేందుకు ఈ సమావేశాలను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
 

                                                            ఎంపీలకు కాంగ్రెస్‌, బిజెపి విప్‌లు జారీ

ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని బిజెపి, కాంగ్రెస్‌ తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. ఎంపీలు పార్లమెంట్‌కు హాజరు కావాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు, ప్రభుత్వ వైఖరికి మద్దతివ్వడానికి పార్లమెంట్‌కు హాజరు కావాలని బిజెపి తమ ఎంపీలను కోరింది. ఐదు రోజుల పార్లమెంట్‌ సమావేశాల్లో.. 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, రాజ్యాంగ సభ నుంచి ఇప్పటి వరకు ప్రయాణంపై ప్రత్యేక చర్చను ప్రభుత్వం జాబితా చేసింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం ప్రొసీడింగ్స్‌లో జాబితా చేసింది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో కాకుండా కొత్త భవనంలో జరిగే అవకాశం ఉంది. లోక్‌సభకు జాబితా చేయబడిన ఇతర బిల్లులలో న్యాయవాదుల (సవరణ) బిల్లు, 2023 ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు, 2023 ఉన్నాయి. ఈ బిల్లులన్నీ ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. 'పోస్టాఫీసు బిల్లు, 2023' కూడా లోక్‌సభ ప్రొసీడింగ్స్‌లో జాబితా చేయబడింది. ఈ బిల్లును ఆగస్టు 10న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

1122