Oct 28,2023 21:54

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రతిపక్షాల కూటమి 'ఇండియా'ను బలోపేతం చేయడం దేశానికి అవసరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 'ఇండియా' మరింత బలోపేతం కావాలని, ఇందుకోసం సిపిఎం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. శనివారం నాడిక్కడ ఏచూరి మీడియాతో మాట్లాడుతూ.. 'ఇండియా' కూటమిలోని అన్ని పార్టీల సీనియర్‌ నేతలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారని, దీనికి సమన్వయ కమిటీలో సభ్యులుగా లేకపోవడం అడ్డంకి కాదని పేర్కొన్నారు. జెడిఎస్‌ కేరళ యూనిట్‌ జాతీయ నాయకత్వానికి పూర్తిగా దూరమైందని, సాంకేతికంగా మాత్రమే ప్రస్తుతానికి కేరళలో జెడిఎస్‌గా కొనసాగుతున్నారని తెలిపారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మానిక్‌ సర్కార్‌ అధ్యక్షతన హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో ప్రారంభమైన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రిపోర్టును వివరించారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయ పరిస్థితులతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుంది.