Nov 22,2022 10:30
  • రూ.850 కోట్లతో సా...గుతున్న పనులు
  • తాగునీటి కోసం 15 ఏళ్లుగా యురేనియం నిర్వాసితుల నిరీక్షణ
  • 470 ఎకరాల భూసేకరణకు అడ్డంకులు

ప్రజాశక్తి - కడప ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని యర్రబల్లి-చిత్రావతి ఎత్తిపోతల పథకం నత్తనడకన సాగుతోంది. 2007 నవంబర్‌లో ఏర్పాటు చేసిన యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కారణంగా కనంపల్లి, వేల్పుల, కనంకింద కొట్టాల, భూమయ్యగారిపల్లి, తుమ్మలపల్లి, మబ్బుచింతలపల్లి, రాచ కుంటపల్లి నిర్వాసిత గ్రామాల్లోని తాగునీరు కలుషితం కావడంతో అంతుబట్టని చర్మ, ఇతర ప్రాణాంతక వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి యర్రబల్లి-గిడ్డంగివారిపల్లి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనుల ద్వారా రెండు టిఎంసిల తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021 జనవరిలో 48.36 కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనులకు రూ.850 కోట్లతో టెండర్లు పిలిచింది. 2024 సంవత్సరం చివరి నాటికి రెండు టిఎంసిల నీటిని సరఫరా చేసే కాంట్రాక్టును ఎంఆర్‌కెఆర్‌ కన్స్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుంది. చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి యర్రబల్లి- గిడ్డంగివారిపల్లి వరకు సర్వే చేసిన అనంతరం పైప్‌లైన్‌ పనులు మొదలు పెట్టారు. 2022 నవంబర్‌ వరకు సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేరకు పనులు చేసింది. ఈ లెక్కన 15 శాతం లోపే పనులు చేసినట్లు అర్థమవుతోంది. పైప్‌లైన్‌ పనుల మందకొడితనానికి పార్ట్‌ బిల్లులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో జూన్‌లో తాత్కాలికంగా పనులను నిలిపేసింది. అనంతరం వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద సుమారు రూ.40 కోట్ల మేరకు బిల్లులు చెల్లించడంతో మళ్లీ పనులు మొదలయ్యాయి.

                                                                       భూసేకరణతోనే జాప్యం

చిత్రావతి-యర్రబల్లి-గిడ్డంగివారిపల్లి ఎత్తిపోతల పథకం పనులకు రూ.40 కోట్ల విలువ కలిగిన భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. లింగాల మండలం నుంచి వేముల మండలం వరకు 470 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. ఇందులో 210 ఎకరాలు ఫారెస్టు భూములు కావడంతో తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీనికితోడు లింగాల, వేముల మండలాల పరిధిలోని కొంతమంది రైతులు 130 ఎకరాల భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో పనుల్లో స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పనులకు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు అధికారులతో కూడిన బృందాలను కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. భూసేకరణ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.
 

                                                                     25 వేల ఆయకట్టు ప్రశ్నార్థకం

యర్రబల్లి-చిత్రావతి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ 29వ కిలోమీటర్ల వద్ద ఎనిమిది చెరువులకు 0.8 టిఎంసిల నీటిని మళ్లించేలా డిజైన్‌ చేశారు. ఇందులో ఎగువపల్లి, దిగువపల్లి, మురారిచింతల, అంబకంపల్లి, యర్రబల్లి, గంగమ్మకుంట చెరువులతోపాటు కోమన్నూతల వాగుకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఇక్కడ 15 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి రానుంది. ఇక్కడి నుంచి ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానించడం ద్వారా 29. కిలోమీటర్ల నుంచి 48.36 కిలో మీటర్ల మధ్యన 1.2 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన గిడ్డంగివారిపల్లి రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంది. గిడ్డంగివారిపల్లి రిజర్వాయర్‌ కింద మరో పది వేల ఎకరాల ఆయకట్టుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ను అందుబాటులోకి రానుంది. వేముల మండలంలోని యుసిఐఎల్‌ పరిధిలోని పైన పేర్కొన్న ఆరు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది.తాగు, సాగునీటి వనరులతో కూడిన బృహత్తరమైన చిత్రావతి-యర్రబల్లి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడం, ఫారెస్టు భూములకు క్లియరెన్స్‌ రాకపోవడం, రైతుల సమ్మతికి నియమించిన బృందాలు ఆశించిన ఫలితాలు రాబట్టని నేపథ్యంలో పైప్‌లైన్‌ పనులు మూడు అడుగులు ముందుకు అరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి.
 

                                                                          సకాలంలో పూర్తి చేస్తాం

చిత్రావతి-యర్రబల్లి ఎతిపోతల పథకం పనులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించాం. పాడా, ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా సమీక్ష జరుగుతుండడంతో సాధ్యమైన మేరకు గడువులోపు పూర్తి చేస్తాం.
                                                     - ఎం.మల్లికార్జునరెడ్డి, ఇరిగేషన్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, కడప.