ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పోలవరం ప్రాజెక్టు కారణంగా వరద బారిన పడుతున్న ప్రజానీకాన్ని ఆదుకోవాలని, వారు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకుసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రాన్ని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మంగళవారం అందచేశారు. గత ఏడాది వరదబారిన పడి అనేకసమస్యలు ఎదుర్కున్న ఇక్కడి ప్రజానీకం తాజాగా వచ్చిన వరదలతో మళ్లీ అనేక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని వివరించారు. ఈ విషయమై దృష్టి సారించి ఇక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని మంత్రిని కలిసిన కె.ఎస్ లక్ష్హణరావు, మంతెన సీతారాంలు కోరారు. మంత్రికి అందించిన విజాక్షపన పత్రంలో గత సంవత్సరం జూలై 11న వచ్చిన గోదావరి వరద వల్ల రెండు జిల్లాల పరిధిలో కూనవరం, విఆర్‌పురం, దేవీపట్నం, ఎటపాక, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో 193 గ్రామాలు పూర్తిగా నీట మునిగి 100 రోజులపాటు వరద నీటిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. అది గోదావరి చరిత్రలో అతిపెద్ద వరదని పేర్కొన్నారు. పోలవరం వద్ద కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల నీరు వెనక్కి తన్ని జల ప్రళయం సంభవించిందని తెలిపారు. ఈ మండలాల్లో ఊళ్లకు ఊళ్లు నేలమట్టం అయ్యాయని, వేలాది కుటుంబాలు కొండలు, గుట్టలు ఎక్కి వారాల తరబడి అక్కడే నానా అగచాట్లు పడ్డారని తెలిపారు. రెండు నెలల అనంతరమే గ్రామాలకు చేరుకున్నారని, సర్వం కోల్పోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రెండువేల రూపాయలు సహాయం మాత్రమే ఇచ్చిందని, సర్వే చేయలేదని నష్టపరిహామూ ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న కాంటూరు లెక్కలు తప్పుల తడకలుగా ఉన్నాయని, ఈ మండలాల్లోని నిర్వాసిత కాలనీలూ వరద నీట మునిగాయని పేర్కొన్నారు. కాంటూరు లెక్కలు పేరుతో పునరావాసాన్ని మూడుదశలుగా నిర్ణయించారని, దీని వల్ల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని, ఒకలక్షా ఆరువేల నిర్వాసిత కుటుంబాలున్నాయని లోక్‌సభలో ప్రకటించినా ఇంతవరకు 10 శాతం పునరావాసం కూడా పూర్తి కాలేదని పేర్కొన్నారు. నష్టపరిహారం, పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) జరగకపోవడం వల్లే వేలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం వరద వల్ల తీవ్ర కడగండ్లు అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి సిపిఎం రాష్ట్ర కమిటీ జూన్ 20న పెద్దఎత్తున పాదయాత్ర చేపట్టిందని వివరించారు. రెండు జిల్లాల్లో 10 మండలాల్లో 300 ముంపు గ్రామాలు, నిర్వాసితకాలనీల మీదుగా ఈ యాత్ర జరిగిందని, వేలాదిగా ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గన్నారని పేర్కొన్నారు. జూలై నాలుగున విజయవాడలో మహాధర్నా జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విజయవాడలో, రాజమండ్రిలో సిపిఎం ప్రతినిధి బృందంతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో నిర్వాసితుల కాలనీల సమస్యలు, గ్రామాల సర్వేలపై చర్చ జరిగిందని, పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారని, గత వారం రోజులుగా ఈ మండలాలు గోదావరి, శబరి నదుల వరద వల్ల మళ్లీ జల దిగ్బంధనంలో ఉన్నాయని తెలిపారు. వరద ముంపు సమస్యపై సత్వరం చర్చ జరగాల్సి ఉందని, దీనిపై మంత్రి చొరవ తీసుకొని వరద సమస్యలకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలని, వరద గ్రామాల నుండి బాధితులను తరలించేందుకు వాహనాల ఏర్పాటు చేయాలని, పడవలు, లాంచీలు సిద్ధం చేయాలని కోరారు. ప్రతి కుటుంబానికి టార్పాలిన్లు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ రహదారులు పునరుద్ధరించాలని, మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు మూతపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, చింతూరులో ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసరును సత్వరం నియమించాలని కోరరు. నిర్వాసితులకు సమగ్రంగా పరిహారం, పునరావాసం కల్పించే విధంగా కేంద్ర ఫ్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు. 1986, 2022 నాటి వరద ముంపు అధారంగా గ్రామాల రీసర్వే చేయాలని, నిర్వాసితులకు పునరావాసం, పరిహారం పూర్తిగా ఇచ్చే వరకూ గ్రామాలు ఖాళీ చేయించరాదని కోరారు.










