- నిర్వాసిత కాలనీల్లో వసతుల కరువు
- అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం
- అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రెయినేజీలు
ప్రజాశక్తి - ఎటపాక, అల్లూరి సీతారామరాజు జిల్లా : పోలవరం నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఒక వైపు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నా.. ఆ స్థాయిలో పునరావాస కాలనీల్లో పురోగతి కనిపించడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో నర్సింగపేట, కాపవరం, ఎర్రబోరు, రాయనపేట, కన్నాయిగూడెం గ్రామాల్లో విఆర్.పురం మండలంలోని 41.15 కాంటూరు ముంపు గ్రామాలకు పునరావాస కాలనీల నిర్మాణాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో వీటి నిర్మాణాలు ప్రారంభించినా నేటికీ ఒక్క పునరావాస కాలనీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. ఐదు పునరావాస కాలనీలలో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నప్పటికీ మౌలిక సదుపాయాలు మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
నర్సింగపేట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో విఆర్.పురం మండలానికి చెందిన ముంపు గ్రామాలైన కొటారిగొమ్ము, శ్రీరామగిరి, సీతంపేట, కొల్లూరు-గొందూరు, విఎన్.పురం, మెట్టగుడెం, కొత్తూరు గ్రామాలకు పునరావాసం కల్పిస్తున్నారు. 285 కుటుంబాలకు ఇక్కడ కాలనీ నిర్మిస్తుండగా వాటిలో కామన్ హౌస్‌లు 259, ట్విన్ హౌస్‌లు 15 ఉన్నాయి. రోడ్లు, డ్రెయినేజీ, పంచాయతీ కార్యాలయం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్, జిసిసి గోడౌన్ తదితర నిర్మాణాలు పూర్తి కాలేదు. రాయనపేట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కూనవరం మండలంలోని 41.15 కాంటూరు ముంపు గ్రామమైన బోజ్జరాయిగూడేనికి చెందిన 166 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులు పూర్తికాలేదు. రోడ్లు లేవు. పాఠశాల, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. గతేడాది గోదావరి వరదలలో ఈ పునరావాస కాలనీ సగం నీట మునిగింది. పునరావస కాలనీ నిర్మాణం చేపట్టక ముందు ఆ ప్రదేశంలో ఆది మానవుల అవశేషాలను గుర్తించారు. ఇది గోదావరి ముంపు ప్రాంతమని గుర్తించి ఆ అవశేషాలను తరలించారు. కానీ అదే ప్రాంతంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణం చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
కాపవరం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో విఆర్.పురం మండలానికి చెందిన తుస్టివారిగూడెం గ్రామస్తులకు 131 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. గతేడాది వరదలకు ఈ కాలనీ సమీపంలోకి వరద నీరు చేరిందని స్థానికులు తెలిపారు. ఎర్రబోరు ఆర్ అండ్ ఆర్ కాలనీలో విఆర్ పురం మండలం ముంపు గ్రామమైన ఇసునూరుకు చెందిన 88 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తికావచ్చినా మౌలిక సదుపాయాలు ప్రారంభానికి నోచుకోలేదు. కన్నాయిగూడెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో విఆర్.పురం మండలానికి చెందిన ములకనపల్లి, భీమవరం, కల్తనురు, ఇప్పూరు గ్రామాలకు చెందిన 329 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన మౌలిక వసతుల జాడే కనిపించడం లేదు. గతేడాది వరదలకు దాదాపు సగం ఇళ్లు నీట మునిగాయి.
అన్ని పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు కేటాయింపులు లేకపోవడమే నిర్మాణల ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఒకవైపు గోదావరి ముంపు గ్రామాలను వరద భయపెట్టి తరుముతుంటే మరోవైపు పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన నత్తనడకన సాగుతోంది.










