- నా స్థానంలో మీరుంటే ఏమి చేస్తారు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)లో ఏమున్నాయో తెలియదని, దానికి సంబంధించి ఇంతవరకు ముసాయిదా రాలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిమ్ మత పెద్దలకు తెలిపారు. దీనిపై ఆందోళన అవసరం లేదని అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలువురు ముస్లిం మత పెద్దలు బుధవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిశారు. యుసిసిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీనిపై సిఎం మాట్లాడుతూ.. యుసిసిపై భయాందోళనలకు గురికావొద్దని, ముస్లిముల మనసు నొప్పించేలా వైసిపి ప్రభుత్వం ఎప్పుడూ వ్యవహరించదని తెలిపారు. ముసాయిదాలో ఏమున్నాయో తెలియదని, మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగా ముస్లిములు తమ మనోభావాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒక రాష్ట్రానికి పాలకుడిగా తాను ఉన్నానని, ఇదే విషయంలో మీరైతే ఏమిచేస్తారో చెప్పాలని వారిని ప్రశ్నించారు. ముస్లిం ఆడబిడ్డల విషయంలో జరుగుతున్న చర్చను ముస్లిం మత పెద్దలు తిప్పికొట్టాలని కోరారు. మహిళలకు సమాన హక్కుల విషయంలో రాజీలేదని పేర్కొన్నారు. దేశం భిన్నమైందని, అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయని తెలిపారు. వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లా బోర్డులు ఉన్నాయని వివరించారు. ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలంటే నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారా చేయాలని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్ లా బోర్డులతో కలిసి అవసరమైతే మార్పు జరగాలే తప్ప వేరే పద్ధతిలో జరిగితే ఇది ఇంత భిన్నత్వం ఉన్న మన దేశంలో తగదని అన్నారు.