ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి జిల్లా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం బహిరంగ లేఖ రాసింది. ఈ మేరకు సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో '2023 అక్టోబర్ 16న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎస్ఇజెడ్ ప్రాంతంలో లారస్ కంపెనీ యూనిట్`2 ప్రారంభానికి అనకాపల్లి జిల్లా పర్యటనకు వస్తున్నందుకు సిఎంకు ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ జిల్లా పునర్విభజన తరువాత అనకాపల్లి జిల్లా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆ సమస్యలను ఈ క్రింద తెలియజేస్తున్నాము. వాటిని పరిశీలించి పరిష్కరించవల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
(1) అచ్యుతాపురం ఎస్ఇజెడ్, పరవాడ ఫార్మా ఎస్‌ఇజెడ్‌లో ఇతర పరిశ్రమలలో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ చేసినప్పుటికీ ఎక్కడా అమలు చేయడంలేదు. నిర్వాసితులు, స్థానిక ప్రజల పట్ల కంపెనీల యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యదోరణితో వున్నాయి.
(2) రాంబిల్లి మండలంలో గల నేవీ (ఎన్‌ఎఒబి) నిర్వాసితులకు నేటికీ చట్ట ప్రకారం పరిహారం అందలేదు. అలాగే భూ నిర్వాసితులకు, సముద్రంపై వేటాడే మత్స్యకారులకు, చేతివృత్తిదార్లుకు, రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి రావల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. శారద, వరహా నధుల్లో వేటాడే మత్స్యకారులందరూ గతంలో 5 నెలలు పాటు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్బంగా తెప్పల మీద ఆధారపడిన వారికి 2 లక్షాల 50వేలు, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రేషన్ కార్డుకు 1లక్షా 30వేలు ఫ్యాకేజీ ఇస్తామన్నారు. నేటికీ దీనిని పూర్తి స్థాయిలో అమలుచేయడంలేదు. ఎన్‌ఎఒబి నిర్మాణ పనుల్లో కూడా నిర్వాసితులకు ఉపాధి కల్పించడంలేదు.
(3) పరవాడ ఫార్మాసిటీలో డవలెపర్గా ఉన్న రాంకీ యాజమాన్యం వ్యర్ధ రసాయనాలను సక్రమైన పద్ధతిలో శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదులుపెడుతోంది. దీనివలన మత్స్య సంపద నాశనమౌతుంది. అలాగే సమీప గ్రామాల్లో ఉన్న చెరువుల్లోకి వ్యర్ధ రసాయనాలను విడిచిపెట్టడం వలన వ్యవసాయం సాగు చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని వలన భూగర్భ జలాలు కలుషితమై చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు మంచినీరు త్రాగడానికి వీలులేకుండా వుంది. ఈ కాలుష్యం వలన వివిధ వ్యాధులకు గురౌతున్నారు.
బఫర్‌జోన్, గ్రీన్‌బెల్ట్ నిబంధనలను రాంకీ యాజమాన్యం తుంగలోకి తొక్కింది. పరిశ్రమల బయట 250 మీటర్లు పొడవునా గ్రీన్‌బెల్ట్ పెంచవల్సి వుంది. కాని ఆ విధంగా పెంచకుండా తాడి గ్రామానికి ఆనుకొని పరిశ్రమలకి రాంకీ యాజమాన్యం భూములు అమ్మకానికి పెట్టింది. దీని వలన ఆ గ్రామం పూర్తిగా కాలుష్యకోరల్లో చిక్కుకొని అల్లాడుతుంది. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గ్రామాన్ని తరలిస్తామని తెలియజేశారు. కాని నేటికీ తరలించలేదు. వెంటనే తాడి గ్రామాన్ని తరలించాలని, వ్యర్ధ రసాయనాలను యధేచ్చగా వదులుతున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
(4) బ్రాండిక్స్‌లో విషయవాయులు 2022 జూన్‌లోనే రెండుసార్లు లీక్ అయ్యాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మహిళా కార్మికులు పరుగులు తీశారు. ఈ కారణంగా 539 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని గౌరవ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) కంపెనీ యాజమాన్యం 10కోట్లు పరిహారం చెల్లించాలని తెలియజేసింది. ఈ పరిహారానికి సంబంధించి అస్వస్థతకు గురైన మహిళా కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాలు చొప్పున పరిహారం ఇవ్వాలని, మిగిలిన సొమ్మును రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అకౌంట్లో వేయాలని ఎన్జిటి తీర్పు చెప్పిన్పటికీ కంపెనీ యాజమాన్యం నేటికీ పరిహారం ఇవ్వలేదు. కోర్టు తీర్పును దిక్కరించింది. వెంటనే యాజమాన్యం నుండి 10కోట్లు రాబట్టాలి.
తమరు పాదయాత్ర సందర్భంగా అచ్యుతాపురం వచ్చినప్పుడు బ్రాండిక్స్‌లో కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని కటింగులు పోయి నెలకు రూ.10వేలు పెంచుతామని హామీ ఇచ్చారు. కాని నేటికీ ఈ హామీని అమలుచేయలేదు. 15 సంవత్సరాల క్రితం వున్న కనీస వేతనాల జీవోనే నేటికీ బ్రాండిక్స్ మరియు ఎస్ఇజెడ్లని ఫార్మా పరిశ్రమలు అమలు చేస్తున్నాయి. దీని వలన కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. కార్మికులు బ్రతకడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
(5) అచ్యుతాపురం మండలం పూడిమడకలో జట్టి నిర్మాణం చేపట్టాలని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జట్టి నిర్మాణం చేపట్టాలని మత్సకారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే యు.వి.వి రమణమూర్తి రాజు గారుతో సహా అందరూ ముక్తకంఠంతో ఏకక్రగీవంగా ఆమోదించారు. కాని నేటికీ ఆ జట్టి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. ఈ విషయంపై మత్స్యకారులు తీవ్ర నిరాశతో వున్నారు. వెంటనే నిధులు కేటాయించి జట్టిని నిర్మించాలి.
(6) అచ్యుతాపురం మండలంలో పరిశ్రమల మధ్యలో వున్న చినపూడి, దుప్పుతూరు, చినతాళ్ళదిబ్బ గ్రామాల ప్రజలు తీవ్ర కాలుష్యంతో అనారోగ్యం పాలౌతున్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరవాసం కల్పించాలి.
జగనన్న ఇళ్లు నిర్మాణం కొరకు ఎదురవాడ, గొర్లధర్మవరం గ్రామాల్లో పేదల నుండి తీసుకున్న భూములకు నేటికి పరిహారం ఇవ్వలేదు. వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని కోరుతున్నాము.
కొండకర్ల ఆవలో పూడికతీయించి ఆ ఆవపై ఆధారపడిన మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని, ఆవ నీరును రైతులకు అందేలా అభివృద్ధి చేయాలని కోరుతున్నాము.
అచ్యుతాపురం టు అనకాపల్లి రోడ్డు విస్తరణలో భూములు, ఇళ్లులు, షాపులు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి.
(7) అచ్యుతాపురం, పరవాడ ఎస్‌ఇజెడ్‌లలో వున్న ఫార్మా కంపెనీల్లో తరుచు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీనితో సకాలంలో వైద్యం అందక అనేక మంది కార్మికులు మరణిస్తున్నారు. కనుక అచ్యుతాపురం కేంద్రంగా ఇఎస్ఐ 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే నిర్మాణం చేపటాలి.
(8) అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏటికొప్పాక, తుమ్మపాల, తాండవ షుగర్ ఫ్యాక్టరీలను మూసివేయడంతో ఆ ఫ్యాక్టరీలపై ఆధారపడిన రైతులు, కార్మికులే కాకుండా వీరిపై ఆధారపడిన లక్షలాది మంది వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఈ మూడు ఫ్యాక్టరీలను ఆధునీకరించి తెరిపించాలని, రైతులు పండిరచిన పంటలకు మరియు బెల్లం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నామ'ని తెలిపారు.