
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి ఆయన శనివారం జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సిఎంఆర్ జంక్షన్లో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల గురించి మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ర్ పాలన మాదిరిగానే పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం కూడా తీవ్ర కృషి చేస్తోందని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డిది మాట తప్పని.. మడం తిప్పని నైజం అని కితాబిచ్చారు. ఆయన పాలన భావితరాల వారికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఎప్పటికీ మరువ లేని.. మరెవ్వెరు చేయలేని మంచి ప్రజలకు చేశారని గుర్తు చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్వర్గీయ వైఎస్‌ఆర్ జయంతి రోజున ఇటు నగరంలో అటు రాష్ట్రంలో మంచి పనులు చేపట్టామని రైతు దినోత్సవాన్ని.. నగరంలో చేపట్టిన శంకుస్థాపన మాసోత్సవాలను ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, రఘురాజు, స్థానిక నగర మేయర్ విజయలక్ష్మి, ఉప మేయర్లు శ్రావణి, లయ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.