Sep 02,2023 21:57

ప్రజాశక్తి - వేంపల్లె :మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 14వ వర్థంతిని పురస్కరించుకుని శనివారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తన సతీమణి భారతితో కలిసి తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌ పోర్టుకు సిఎం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తల్లి వైఎస్‌.విజయమ్మ, చిన్నాన్న వైఎస్‌.సుధీకర్‌రెడ్డి, కడప ఎంపి వైఎస్‌.అవినాష్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి ముఖ్యమంత్రి జగన్‌ ఘనంగా నివాళులర్పించారు. ఘాట్‌ సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహనికి పూలమాలలు వేశారు. అంతకు ముందే సిఎం చెల్లెలు, వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించారు. తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం సిఎం విజయవాడకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి.అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, శాసనమండలి డిప్యూటి చైర్మన్‌ జఖియాఖనం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.