Oct 02,2023 21:20

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ తదితర ప్రభృతులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం ఢిల్లీలో రాజ్‌ఘాట్‌లోని గాంధీజీ సమాధిని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోడీ తదితరులు పుష్ప గుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
'గాంధీజీ సిద్ధాంతాలు కేవలం ఆలోచనల్లో నుంచి వచ్చినవి కావని, అవి అనుభవంలో రాటుదేలిన సత్యాలు అని రాష్ట్రపతి కొనియాడారు. జీవితానికి ఉపయోగపడని తత్వం ఏదైనా 'ధూళి లాంటిదేనని ఆమె అన్నారు. గాంధీజీ ఏం చెప్పేవారో అది ఆచరించి చూపేవారని ఆమె ట్వీట్‌ చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, . ఆయన బోధనలు మన మార్గాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తూనే ఉంటాయని ్పధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మన మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని పెంపొందించుకుందామని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.
భారతదేశ రెండవ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి కూడా అక్టోబరు2నే కావడంతో విజరుఘాట్‌ను సందర్శించి, ఆయనకు కూడా ప్రధాని నివాళులర్పించారు. ఆయన ఇచ్చిన ' జై జవాన్‌, జై కిసాన్‌' పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళులర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సహమత్‌ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌, పత్రికా రిపోర్టుల ప్రదర్శన మనసుకు హత్తుకునేలా ఉందని ఆయన పేర్కొన్నారు. గాంధీజికి సంబంధించి శుభాముద్ఘల్‌ సంగీత కచేరి, కవితాగానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఏచూరి పేర్కొన్నారు.
'సత్యం, అహింస, సామరస్యంతో భారత్‌ను ఐక్యం చేసే మార్గాన్ని మహాత్మాగాంధీ మనకు చూపించారు. బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు' అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.