Jul 12,2023 15:16

ఢిల్లీ : ఇందిరా గాంధీ హత్యకు గురైన 1984 అక్టోబరు 31వ తేదీన ఎయిమ్స్‌లో జరిగిన సంఘటనల గురించి ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, అప్పటి కార్డియాలజీ విభాగాధిపతి పి.వేణుగోపాల్‌ 'హార్ట్‌ఫెల్ట్‌' పుస్తకంలో వివరించారు. గత వారం ఆ పుస్తకం విడుదలైంది. అందులో ఇందిరను ఆస్పత్రికి తరలించిన తర్వాత నాలుగు గంటల్లో ఏం జరిగిందో కూలంకషంగా వివరించారు. 'వంటి నిండా బుల్లెట్‌ గాయాలతో ఉన్న ఇందిరా గాంధీని ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుల్లెట్లు ఆస్పత్రి నేలనిండా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆమె శరీరం నుంచి రక్తం ధారగా కారుతోంది. ఆమె పొట్టలోంచి రక్తం ఉబికివస్తోంది. ఆమెను కాపాడటానికి నాలుగు గంటలపాటు వైద్యులు, సర్జన్లు, నర్సింగ్‌ స్టాఫ్‌ ఎంతగానో శ్రమించారు. ఆమెకు ఓ నెగిటివ్‌ రక్తాన్ని ఎక్కించడానికి ఒకవైపు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆసుపత్రి కారిడార్‌లో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. తదుపరి ప్రధాని ఎవరు.. ఎప్పుడు ప్రమాణం చేయాలనే చర్చ సాగింది. నేను వెంటనే పదవీ విరమణ చేయబోతున్న డైరెక్టర్‌ టాండన్‌, కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న స్నేV్‌ా భార్గవ్‌ వద్దకు వెళ్లా. వారిద్దరూ నిస్సహాయంగా నా వైపు సలహా కోసం చూశారు. కార్డియాక్‌ సర్జరీ అధిపతిగా నేను అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వెంటనే రక్తస్రావాన్ని ఆపాలని సూచించా. కనీసం అధీకత సంతకం కోసం కూడా నేను ఆగలేదు. ఇందిరను బైపాస్‌ యంత్రంపై ఉంచి.. బుల్లెట్లతో నిండిపోయిన ఆమె పొట్ట భాగంలో రక్తస్రావాన్ని ఆపాలనేది ప్రణాళిక. దీనిపై 4 గంటలపాటు పని చేశాం. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బైపాస్‌ చేయడానికి వైద్యులు ప్రయత్నించారు. కానీ కాపాడలేకపోయాం. ఆమె చనిపోయిన విషయాన్ని కుమారుడు రాజీవ్‌ గాంధీకి చెప్పడానికి బయటకు వచ్చినప్పుడు నాకు నోటివెంట మాటలు రాలేదు' అని వేణుగోపాల్‌ పుస్తకంలో వివరించారు.