Aug 23,2023 21:38

ప్రజాశక్తి-ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దేవరంపాడులో, ప్రకాశం పంతులు జన్మించిన నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెంలో ఆంధ్రకేసరి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. దేవరంపాడులో జరిగిన కార్యక్రమంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కె.శ్రీనివాసులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధైర్యానికి, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం ప్రకాశం పంతులు అని కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి.. ఈ ఏడాది చివరినాటికి నీళ్లు ఇస్తామని తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడారు.