Aug 10,2023 14:58
  • ఎస్‌ఐతోపాటు, మహిళా కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వైసిపి నాయకులు వీరంగం సృష్టించాడు. ఎమ్మెల్యే మనుషులమంటూ బీభత్సం సష్టించారు. పది మంది అనుచరులతో కలిసి విధుల్లో ఉన్న ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. వైసిపి కార్యకర్త సురేశ్‌.. బుధవారం ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మందు సీసాలు తరలిస్తుండగా సెబ్‌ పోలీసులు పట్టుకున్నారు. సరకును సీజ్‌ చేసి అతణ్ని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న 32వ డివిజన్‌ వైసిపి కార్పొరేటర్‌ సాకే చంద్ర తన అనుచరులతో స్టేషన్‌కు వచ్చి.. 'మేము ఎమ్మెల్యే మనుషులం. మా మనిషినే స్టేషన్‌కు తీసుకొస్తారా' అంటూ కానిస్టేబుళ్లతో గొడవకు దిగారు. ఎస్‌ఐ కుర్చీలో కూర్చోడానికి ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ రాధమ్మ అడ్డుపడగా ఆమెపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌కు స్వల్ప గాయమైంది. ఈ క్రమంలో పోలీసులు, వైసిపి నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో ఎస్‌ఐను పక్కకు తోసేశారు. ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని వారందరినీ బయటకు పంపించారు. ఘటన సమాచారం తెలుసుకున్న సెబ్‌ అదనపు ఎస్‌పి రామకృష్ణ వచ్చి ఘటనపై ఆరా తీశారు. కానిస్టేబుల్‌ రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.