
ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారని హంద్రీనీవా,హెచ్‌ఎల్‌సి కెనాల్ ద్వారా డిసెంబర్ 30వ తేదీ వరకు సాగునీరు ఇవ్వాలని ఉరవకొండ సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు,కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ వరకు సాగునీరు ఇవ్వకపోతే ఆత్మహత్యలు శరణ్యమన్నారు. నియోజకవర్గ పరిధిలో లక్షలాది ఎకరాలలో మిరప,పత్తి,కంది,వేరుశనగ తదితర పంటలను లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేశారన్నారు.పంటలు పూతలు కాయలు కాసి చేతికొచ్చే సమయాలలో కెనాల్ లలో సాగునీరు సరఫరా చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.వేరుశనగ పంటలకు ఎకరాకు 50 వేలు మెరప పంటలకు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి చిన్న,సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు.పంటలకు సాగు పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సీనప్ప,వెంకటేశులు,మహేష్,సుంకన్న తదితరులు పాల్గొన్నారు.