
ప్రజాశక్తి-అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ఆయన పట్టణంలోని 15వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబును జైలు పాలు చేసి నలభై రోజులు గడుస్తున్నా వైసీపీ సర్కార్ నయాపైసా అవినీతిని కూడా బయట పెట్టలేకపోయిందన్నారు. క్విడ్ ప్రోకో పద్ధతిలో 2004 తరువాత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి నిధులు మళ్లిన అంశం ఇంకా జనం మదిలో ఉందన్నారు. పక్కా సాక్షాధారాలతో సీబీఐకి దొరికిన ఆర్థిక నేరస్తుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు నిధులు వచ్చాయని జగన్ అండ్ కో చేస్తున్న ఆరోపణలను నిరూపించలేక పోతున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు వైసిపి పాలనపై తీవ్రమైన అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు, కక్ష సాధింపు చర్యలకు తగిన బుద్ధి చెప్పడానికి ఎన్నికల కోసం ప్రజలు ఆతతగా ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ ను రాజకీయంగా సమాధి చేయడానికి అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారని కాలవ శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, 15 వ వార్డు నాయకులు శ్రీనివాసులు, శ్రీరాములు, అనిల్, రాష్ట్ర మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి సంపత్ కుమారి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం,డాక్టర్ చన్నవీర, తిప్పేస్వామి, ఎస్సి సెల్ మల్లి, ప్రహ్లాద, నాగరాజు నాయక్, జావీద్, ఇబ్రహీం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.