Nov 06,2023 12:25

రాజమహేంద్రవరం చేరుకున్న ప్రజా రక్షణభేరి యాత్ర

 

*********************************************

విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.లోకనాథ్, మంతెన సీతారాం

ప్రజాశక్తి కాకినాడ ప్రతినిధి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేనలు ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.లోకనాధం, మంతెన సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర ఆదివారం రాత్రి కాకినాడ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం స్థానిక సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. బిజెపి విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మతోన్మాద ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ సామాజిక సాధికారిక యాత్ర అని చెప్పడం తగదన్నారు. రిజర్వేషన్లు అనేవి కాగితానికే పరిమితం అయ్యాయని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగానే ఉందన్నారు.
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కూడా హామీలను అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేశారన్నారు. విద్యకు సంబంధించిన మౌలిక వసతులను కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సుమారు 2.40 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ తో ఉద్యోగాల కల్పన చేపడతామని హామీ ఇచ్చి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న సహజవాయువు గ్యాస్ ను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే గ్యాస్ ను సరఫరా చేయవచ్చని అయితే ఉత్తరాంధ్ర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుండి గ్యాస్ ను తరలిస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నిమ్మకు నీరుత్తుతున్నట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. పట్టణాల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోగా ఆస్తి విలువ ఆధారిత పన్నులు , చెత్త పన్నులు విపరీతంగా పెంచేసి ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు అత్యంత దయనీయంగా ఉన్నాయన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఎస్సీ, ఎస్టీలను 125 అడుగుల పాతాళానికి తొక్కేసారన్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరుగుతుంటే, వారి భూములను లాక్కుంటుంటే రాష్ట్రంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ సామాజిక సాధికారత అని యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 
గ్రామీణ ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు సంబంధించిన చట్టాన్ని సవరించి దళితులకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో డి పట్టా భూములను అక్రమంగా తీసుకుంటున్నారన్నారు. గిరిజన ప్రాంతాలలో చట్టాలను రద్దు చేస్తూ అమలు చేయడం లేదన్నారు. పాఠశాలల్లో తగినంత ఉపాధ్యాయులు లేకపోయినా మెగా డీఎస్సీ, స్పెషల్ డిఎస్సి లాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి జనసేన పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ అన్ని పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి పోరాటం చేయాలన్నారు.

poster

పోస్టర్ ఆవిష్కరణ

లౌకికవాదం,  ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 15న విజయవాడలో జరుగు ప్రజా రక్షణ భేరి మీటింగ్ కు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.లోకనాధం, మంతెన సీతారాం తదితరులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవీ.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి, రాష్ట్ర నాయకులు హరిబాబు, సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా నాయకులు కేఎస్.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష బాబ్జి తదితరులు పాల్గొన్నారు.