Nov 10,2023 16:09

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన మొదటి దశ బస్సు యాత్ర శుక్రవారం తో ముగియనుంది. ఫస్ట్‌ ఫేజ్‌ లో 39 నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్దేశించుకున్నా పలు కారణాలతో 35 నియోజకవర్గాల్లో పూర్తి అవుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఏకకాలంలో ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో మూడు బస్సు యాత్రలు, మూడు సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి బస్సు యాత్ర ప్రారంభం అయింది. ఈ బస్సు యాత్ర పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గోనే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఈ సామాజిక వర్గాలకు తమ ప్రభుత్వం చేసిన అభివఅద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించడమే ప్రధాన అజెండా. ఈనెల 15వ తేదీ నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు అంటే ఈనెల 30వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుంది. సెకెండ్‌ ఫేస్‌లో 40 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తి చేయనున్నారు. 60 రోజుల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లను సామాజిక సాధికార బస్సు యాత్ర పూర్తి చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. మొత్తం మీద మొదటి దశ సామాజిక సాధికార యాత్ర కొనసాగిన తీరు పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.