- ప్రతి పేదవాడికీ సంక్షేమాన్ని చేరువ చేశాం
ప్రజాశక్తి - యంత్రాంగం : విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో సిఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, ప్రతీ వ్యక్తికి సంక్షేమాన్ని చేరువ చేశారని పలువురు వైసిపి నేతలు అన్నారు..బస్సు యాత్ర రెండోరోజూ తిరుపతి, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొనసాగింది. ఆయా చోట్ల నిర్వహించిన సభల్లో మంత్రులు మాట్లాడారు.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. చంద్రబాబు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మన జీవితాలు, సామాజిక పరిస్థితులు ఎలా మారాయనేది చూడాలని, జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పీడిక రాజన్నదొర మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయడంలో సిఎం ముందంజలో ఉన్నారని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. 'చంద్రబాబు హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అందుకే చిత్తుగా ఓడిపోయాడు'. అని విమర్శించారు. బూడి ముత్యాలనాయుడు తదితరులు మాట్లాడారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సభలో మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకు దక్కని గౌరవం జగన్ హయాంలో దక్కిందన్నారు. మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ... ప్రతీ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి ఉండాలని వివిధ కార్పొరేషన్లలోనూ ప్రభుత్వ పదవుల్లోనూ బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు సమపాళ్లలో ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు.
తిరుపతిలో సభనుద్దేశించి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం ద్వారానే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని భావించి వారికి పదవులు ఇచ్చిన ఘనత జగనన్నదే అన్నారు. ఎంపి గురుమూర్తి, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినరురెడ్డి తదితరులు మాట్లాడారు.
జాతీయ రహదారిపై టిడిపి శ్రేణుల బైఠాయింపు
విజయనగరం నుంచి గజపతినగరం వెళ్తున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును బొండపల్లి పోలీసుస్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వైసిపి బస్సుయాత్ర నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి శ్రేణులంతా స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించారు. వైసిపి తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.