Oct 28,2023 21:55

ప్రజాశక్తి - యంత్రాంగం:ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించి వారికి అగ్రపీఠం వేసింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పలువురు వైసిపి నాయకులు తెలిపారు. మహిళలకు సముచిత స్థానం కల్పించి ఆర్థిక భరోసానిచ్చామన్నారు. వైసిపి చేపట్టిన బస్సు యాత్రలు మూడో రోజూ కడప, బాపట్ల, విశాఖపట్నంలో కొనసాగాయికడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక శివాలయం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14ఏళ్ల పాలనలో చేసిందేమీలేదని విమర్శించారు. రాజ్యసభ ఎంపి బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. బిసిలకు రూ.లక్షా62వేల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించామని తెలిపారు. కర్నూలు మాజీ ఎంపి బుట్టా రేణుక మాట్లాడుతూ.. మహిళలకు సముచిత స్థానం కల్పించి ఆర్థిక భరోసానిచ్చిన పార్టీ వైసిపి అని అన్నారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. చేసిన తప్పుకు తండ్రి జైల్లో ఉంటే తనయుడు లోకేష్‌ ఐదు రోజులు రాష్ట్రంలో లేరని, జైల్లో వేస్తారనే భయంతో ఢిల్లీకి పారిపోయారని విమర్శించారు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతారని, దత్త పుత్రుడు మాత్రం చంద్రబాబు సిఎం కావాలని పార్టీ నడుపుతున్నాడని ఎద్దేవా చేశారు.
విశాఖ తగరపువలస సమీపంలోని చిట్టివలస ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ..లోకేష్‌, భువనేశ్వరి సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయన్నారు. తాను నిప్పంటూ ఇన్నాళ్లూ చెప్పుకున్న చంద్రబాబు..స్కీమ్‌ల పేరిట స్కాములు చేసి రాజమండ్రి జైలు ఉన్నారన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..రాష్ట్రంలో 136 వెనుకబడిన తరగతులను గుర్తించి 36 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, పాలక వర్గాలను నియమించామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి సిఎం పెద్దపీట వేస్తున్నారన్నారు. రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని తెలిపారు. బాపట్లలో జరిగిన సభలో మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ..ఎవరెన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా మళ్లీ గెలిచేది వైసిపినే అని అన్నారు. ఎంపి నందిగాం సురేష్‌ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు కుంభకోణం చేస్తే.. పేదల కోసం జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు.