
విశాఖపట్నం: వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులు కిడ్నాప్ అయ్యారు. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు ఆ కుటుంబానికి సన్నిహితుడు, ఆడిటర్, వైసిపి నేత గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను కొందరు అపహరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఎంపీ ప్రస్తుతం నగరంలో లేరని.. ఈ క్రమంలో ఆనందపురంలోని కుమారుడి వద్దకు ఆయన భార్య వెళ్లే సమయంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం తెలిసి జీవీ అక్కడికి వెళ్లడంతో ఆయన్ను కూడా అపహరించినట్లు తెలుస్తోంది. వారందరినీ అక్కడే ఓ ఇంట్లో నిర్బంధించినట్లు సమాచారం. బుధవారం జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది.విషయం బయటకు రావడంతో పోలీసులు స్పందించారు. ఎంపీ కుటుంబసభ్యులు, ఆడిటర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని తెలిపారు. కిడ్నాపర్ల వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని చెబుతున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.