- ఒకేరోజు రూ.3,273 కోట్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రెండో త్రైమాసికంలో ఓవర్‌డ్రాఫ్ట్ వేధిస్తోంది. వరుసగా నాలుగు రోజులు ఓవర్‌డ్రాఫ్ట్‌లోనే రాష్ట్ర ఖజానా కొనసాగింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు రూ.3,273 కోట్లు ఓడీగా నమోదు కావడం గమనార్హం. ఇది క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని రిజర్వ్‌బ్యాంకు నేరుగా ఓవర్‌డ్రాఫ్ట్‌కు జమ చేస్తుండడమేనని అధికారులు చెబుతున్నారు.ఈ నెల మూడో తేదీన రూ.3,273 కోట్లు ఓవర్‌డ్రాఫ్ట్‌గా వాడుకున్నారు. ఆ తరువాత ఖజానాకు వచ్చిన రూ.581 కోట్లు ఆర్‌బిఐ తీసుకోవడంతో ఓడీ మొత్తం 2,692 కోట్లకు తగ్గింది. ఆ తరువాత మరో రూ.1,610 కోట్లు జమ కావడంతో ఓడీ రూ.1,082 కోట్లకు, ఆ తరువాత ఇంకో రూ.320 కోట్లు జమ కావడంతో రూ.762 కోట్లకు ఓవర్‌డ్రాఫ్ట్ చేరుకుంది. ఒకేసారి రూ.4,600 కోట్ల వరకు మాత్రమే ఓడీ తీసుకోవడానికి పరిమితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆ స్థాయిలో ఓడీకి వెళ్లకపోయినప్పటికీ, తొలిసారి రూ.3,273 కోట్లు తీసుకోవాల్సి రావడం ఆశ్చర్యకరమేనని ఆర్థికశాఖ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.










